ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారు..?. ఇది బయటకు చాలా సిల్లీ క్వశ్చన్.. ఇంకెవరు నడుపుతారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఎవరైనా అంటారు. కానీ అది దూరంగా ఉండి చూసేవారికే. ప్రభుత్వ నిర్వహణలో ప్రత్యక్ష ప్రమేయం ఉన్న అత్యున్నత అధికారి దగ్గర్నుంచి కింది స్థాయి అటెండర్ వరకూ.. అలా అనుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వాన్ని నడిపేది.. ఆదేశాలు ఇచ్చేది .. సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డేననిఅందరికీ ఈ పాటికి అనుభవమైపోయి ఉంటుంది.
తానే అనధికారిక సీఎం అని చెప్పుకోవాలని సజ్జల తాపత్రయం..!
అత్యంత కీలక శాఖలకు ఆయన అనధికారిక మంత్రి. ముఖ్యమంత్రి హోంశాఖ మొత్తం ఆయన కనుసన్నల్లోనే ఉంటుందని చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి.. ఆయన చెప్పింది జరిగిపోతుంది. ముఖ్యమంత్రి కూడా ఆయనపై అమితమైన నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి బండి నడిచిపోతోంది. చాలా మంది మంత్రులకు తమ శాఖల్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు… ఎక్కడున్నా వచ్చి నిర్ణయాలు ప్రకటించమంటే వచ్చి ప్రకటిస్తారు. కొద్ది రోజుల కిందట.. మంత్రి సురేష్.. పరీక్షల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. ఆయన అప్పుడు తన నియోజకవర్గం యర్రగొండపాలెంలో ఉన్నారు. ఆయనను హుటాహుటిన పిలిపించారు. ఆయన వచ్చేదాకా.. పరీక్షలను రద్దు చేస్తున్నామని ఆయనకు కూడా తెలియదు. అంటే నిర్ణయం అప్పటికే ఎవరో తీసుకున్నారు… మంత్రి సురేష్ చేత ప్రకటింప చేశారు.ఆ నిర్ణయం ఎవరో కాదు.. సజ్జల తీసుకున్నారని.. సెక్రటేరియట్ మొత్తం తెలుసు. కానీ ఎవరికీ నోరెత్తే ధైర్యం లేదు.
మంత్రులకు తిట్టుడు బాధ్యతలు.. తానేమో ప్రభుత్వ విధాన నిర్ణయాల ప్రకటన కర్త..!
ప్రభుత్వాన్ని పరోక్షంగా నడుపుతున్న సజ్జల ఈ విషయాన్ని అంతర్గతంగానే ఉంచితే సరిపోయేది కానీ.. ప్రభుత్వాన్ని పరోక్షంగా తానే నడుపుతున్నానని బయట ప్రపంచానికి కూడా తెలియాలని అనుకుంటూ… నేరుగా తెర మీదకు వచ్చేందుకు ఏ మాత్రం సంకోచించకపోవడమే ప్రస్తుతం అనేక రకాల విమర్శలకు.. అనర్థాలకు కారణం అవుతోంది. బూతులు తిట్టడానికి కొంతమంది మంత్రులను వైసీపీ ప్రయోగిస్తుంది. వారెవరూ సబ్జెక్ట్ మాట్లాడరు. హైకమాండ్ ఎవరిని చెబితే.. వారిని ఇష్టారాజ్యంగా తిట్టడమే వారి పని. కానీ అసలు కీలకమైన విషయాలపై మాట్లాడటానికి సజ్జల తెరపైకి వస్తున్నారు. మాజీ ముఖ్యమమంత్రి చంద్రబాబుకు కౌంటర్ ఇవ్వడం దగ్గర్నుంచి అత్యంత కీలకమైన విధానపరమైన నిర్ణయాల వరకూ తానే ప్రెస్మీట్లు పెడుతున్నారు. చివరికి నీటి వివాదంలోనూ ఆయనే జోక్యం చేసుకుంటున్నారు. అక్కడే ఇంతకూ అసలుఆయన హోదా ఏంటి.. అనే చర్చ రావడానికి కారణం అవుతోంది.
వైఎస్ దగ్గర కేవీపీ కూడా తగ్గే ఉన్నారు… సజ్జల మాత్రం జగన్‌ను డామినేట్ చేస్తున్నారు.. !
సజ్జల వ్యవహారం ఇప్పుడు వైసీపీలోనూ చర్చనీయాంశం అవుతోంది. సాధారణ ప్రజల్లోనూ అదే కారణంతో తెరపైకి వస్తోంది. అసలు ఐదుగురు ఉపముఖ్యమంత్రులు ఉండి.. ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత కీలకమైన విషయాల్లో వారెవరూ మాట్లాడకుండా.. సజ్జల ఎందుకు తెర మీదకు వస్తున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు. గతంలో వైఎస్‌కు కేవీపీ ఆత్మగా ఉండేవారు. సలహాదారు పదవి కూడా ఉండేది. కానీ ఆయన ఎప్పుడూ తెర ముందుకు వచ్చి ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను ప్రకటించాలని అనుకోలేదు.కానీ సజ్జల మాత్రం జగన్ దగ్గర ఆ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు.