పోలీసులు ప్రభుత్వ ఉద్యోగులే. కానీ వారికి ప్రత్యేకమైన బాధ్యతలు ఉంటాయి. సర్వీస్ రూల్స్ ఉంటాయి. వాటిని ఉల్లంఘిస్తే నిస్సంకోచంగా ప్రభుత్వం డిస్మిస్ చేయవచ్చు. ఈ విషయంపై అవగాహన లేదో ఉన్నా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని అనుకున్నారో కానీ బెటాలియన్ పోలీసులు సర్వీస్ రూల్స్ ఉల్లంఘించారు. యాభై మంది వరకూ ఉద్యోగాలు కోల్పోయే పసిస్థితుల్లోకి వచ్చారు. పది మందిని ఇప్పటికే డిస్మిస్ చేశారు. రోడ్డెక్కిన మిగిలిన వాళ్లనూ డిస్మిస్ చేసి కొత్త రిక్రూట్ మెంట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు.
పోలీస్ బెటాలియన్ ఉద్యోగులు ఏక్ పోలీస్ నినాదంతో ఉద్యమం చేస్తున్నారు. గతంలో ఉన్న విధానాన్నే పాటిస్తామని డీజీపీ ఉత్తర్వులు ఇచ్చారు. అయినా పోలీసులు ఆందోళనలు చేశారు. అంటే ఏమిటి అర్థం.. వారి వెనుక బలమైన రాజకీయ శక్తి ఉందనే. తమ ఆందోళనతో ప్రభుత్వం తగ్గింది కాబట్టి ఇంకా ఏదో చేయాలన్న తపనతోనే. పోలీసు కుటుంబాలకు కష్టాలు ఉండవని ఎవరూ చెప్పరు. బెటాలియన్ పోలీసులకు ఉంటాయి… మామూలు పోలీసులకూ ఉంటాయి. ఎవరి స్థాయిలో వారికి కష్టాలుంటాయి. అందుకే ఎవరికి వారు యూనియన్లు పెట్టుకుని పోరాడతారు. కానీ దానికి కూడా ఓ పద్దతి ఉంటుంది. పోలీసు అనే ట్యాగ్ వేసుకున్న వారికి ఎంత చిరుద్యోగికి అయినా ఎంతో బాధ్యత ఉంటుంది.
గత కొద్ది రోజులుగా ఓ వర్గం మీడియానే హైలెట్ చేస్తూ వస్తోంది పోలీసు ఆందోళనలను. అది ఎలా ఉందంటే సోషల్ మీడియాలో ఎలాంటి స్టోరీలు వైరల్ అవుతాయో అలాంటి స్టోరీల్నే నడిపించారు. రీల్స్ చేయించారు. గర్భిణీ, భర్త స్టోరీలు వినిపించారు. పాపం ఇన్ని కష్టాలా అనిపించేలా మంచి శాడ్ మ్యూజిక్ తో రన్ చేశారు. కానీ ఏ ఉద్యోగంలో వెసులుబాటు ఇస్తారో ఎవరైనా చెప్పగలరా ?. ఆ కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ఎంత కష్టపడి వచ్చారో.. ఆ ఉద్యోగం కోసం ఎంత మంది గ్రౌండ్లలో పరుగులు పెడుతున్నారో అంచనా వేయగలరా ? . పోలీసుల కష్టాలపై అందరికీ సానభూతి ఉంటుంది కానీ.. ఇలా ప్రభుత్వంపైనే రాజకీయ ఉద్దేశాలతో తిరుగుబాటు చేయడం మాత్రం అసాధారణమే అనుకోవచ్చు.