“కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేయి” అనేది రాజకీయ నేతలు తమకు ఎదురయ్యే సవాళ్ల విషయంలో పాటించే మొట్ట మొదటి చిట్కా. ప్రజల్ని అడ్డంగా మోసం చేస్తున్నామని వారికి తెలుసు. అయినా సరే తగ్గరు. ఎందుకంటే ఇప్పటి ప్రజలు .. ఓటర్లు తాము మోసపోతున్నామని తెలిసినా సరే … కళ్ల ముందు కనిపిస్తున్నా సరే తెలుసుకోవడం లేదు. పార్టీల అభిమానం.. కులాభిమానం… నేతలపై అభిమానం ఇలా అన్ని రకాల అభిమానాలు కలగలిపి వారి కళ్లను కప్పేస్తున్నాయి. అది అసాధ్యం అని తెలిసినా రాజకీయ నేతలు చేసే విన్యాసాలకు బాకా ఊదేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో జరుగుతోంది ఇదే. విశాఖస్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం కేబినెట్లో నిర్ణయం తీసుకుంది. ఇవాళ కాకపోతే రేపు చేసి తీరుతుంది. కానీ ప్రజల్ని మభ్యపెట్టి తాము చాంపియన్లం అని అనిపించుకోవడానికి గత నాలుగు రోజులుగా జరుగుతున్న రాజకీయం అంతా డ్రామా అని ప్రజలకు స్పష్టంగా తెలుసు… కానీ రాజకీయ పార్టీల మత్తులో ఉన్న ప్రజలు వాటిని గుర్తించడానికి వెనుకాడుతున్నారు. నిజం తెలిసినా … దాన్ని అంగీకరిస్తే తమ రాజకీయ ఆసక్తులు ఎక్కడ దెబ్బతింటాయోనని సైలెంట్ గా ఉంటున్నారు.
కేబినెట్ నిర్ణయాన్ని… సహాయ మంత్రి ఆపగలరా ?
కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చి ప్రైవేటీకరణపై ప్రస్తుతానికి ముందుకెళ్లడం లేదని ప్రకటించారు. అంతే తమ వల్లేనంటూ.. కొన్ని పార్టీలు గులాల్ చల్లుకోవడం ప్రారంభించాయి. ఇక విశాఖలో విజయోత్సవాలు నిర్వహిస్తున్నామని గప్పాలు కొట్టుకోవడం కూడా ప్రారంభించారు. అసలు కాస్త బుర్ర పెట్టి ఆలోచిస్తే… ప్రజల్ని రాజకీయంగా మోసం చేయడం ఆపి.. నిజంగా స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం కాకుండా చూడాలని అనుకుంటే… ఈ సహాయ మంత్రి ప్రకటనలో ఉన్న నిజాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆయన కేవలం కేంద్ర సహాయ మంత్రి. కేబినెట్ మంత్రి కూడా కాదు. ఆయనకు కేబినెట్ సమావేశాల్లోకి కూడా ఆహ్వానం ఉండదు. అలాంటిది కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని మార్చగలరా ?. ఇదే విషయాన్ని ఆయన జరగాల్సిందంతా జరిగిన తర్వాత తీరికగా కార్మిక సంఘం నేతలను పిలిచి చెప్పారు. రాజకీయాల గురించి మీరు మర్చిపోండి.. జరగాల్సిన సమయంలో… విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగిపోతుందని తేల్చి చెప్పేశారు. దీంతో భారత రాష్ట్ర సమితి ప్రారంభించిన బిడ్డింగ్ రాజకీయం దగ్గర్నుంచి … సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ తన రాజకీయ భవిష్యత్ కోసం ఆడుతున్న ట్వీట్ల ఆట వరకూ అంతా తేలిపోయింది. అసలు అధికారిక ప్రకటన లేకుండా.. కేబినెట్ నిర్ణయాన్ని ఎలా ఉపసంహరించుకుంటారన్నది ఆలోచిస్తే…. రాజకీయ పార్టీలు ప్రజల్ని మరీ ఇంత ఆలోచనా శక్తి లేకుండా మార్చేస్తున్నాయా అని ఆశ్చర్యపోక మానరు.
స్టీల్ ప్లాంట్ నడపడానికి మూలధనం కూడా లేనట్లు కేంద్రం కథలు !
విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉన్నమాట నిజమే. కానీ అదీ మరీ దివాలా స్థితికి చేరిందని ఎవరూ అనుకోవడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉక్కు పరిశ్రమ కోలుకొంటున్న సమయమిది. ఉక్కుకు మార్కెట్ డిమాండ్ పెరుగుతోంది. స్టీల్ ప్లాంట్ ఇప్పడులాభాల బాటలోనే నడుస్తోంది. కేంద్ర ఉక్కు శాఖ విడుదల చేసిన 2021-22 వార్షిక నివేదిక ప్రకారం రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఎన్పీఎల్)కు పన్నుకు ముందు రూ.946 కోట్లు, పన్ను తర్వాత రూ.790 కోట్లకు పైగా నికర లాభం వచ్చింది. అంతకు ముందు సంవత్సరం వచ్చిన రూ.1,839 కోట్ల నష్టాలను అధిగమించి ఈసారి లాభాలబాట పట్టింది. గత ఏడాది డిసెంబర్ చివరికి 15,928 మంది ఉద్యోగులతో ఈ సంస్థ గత సంవత్సరంతో పోల్చి చూస్తే ముడి ఉక్కు ఉత్ప్తిలో 47 శాతం.. ఫినిష్డ్ స్టీల్ ఉత్పత్తిలో 75% వృద్ధి సాధించినట్లుగా లెక్కల్లో స్పష్టమైంది.
సంస్థ ఉత్పత్తితో పాటుగా..అమ్మకాలు..అదే సమయంలో కంట్రిబ్యూషన్ మార్జిన్లలోనూ మంచి ఫలితాలు కనిపించాయి. తాజా లెక్కల మేరకు డిసెంబర్ చివరి నాటికే గత ఏడాది కంటే 69 శాతం వృద్ధిని నమోదు చేస్తూ.. రూ.19,401 కోట్ల అమ్మకాల టర్నోవర్‌తో నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరం లెక్కలు ఇంకా విడుదల చేయాల్సి ఉంది. లాభాలు ఇంకా పెరిగాయని చెబుతున్నారు. అయితే అసలు స్టీల్ ప్లాంట్ ను నడపడానికే డబ్బులు .. నిధులు.. ముడిసరుకు లేవని కేంద్రం కథలు చెబుతోంది. మూలధనం కోసం ఈవోఐ జారీ చేసింది. ‘‘వర్కింగ్ క్యాపిటల్ లేదా ముడి పదార్థాలు సరఫరా చేస్తే.. దానికి బదులుగా స్టీల్ ఇస్తాం’’ అంటూ గతనెల 27వ తేదీన విశాఖ ఉక్కు యాజమాన్యం ఈవోఐ వెలువరించింది. ‘‘ఉక్కు, ఉక్కు ఉత్పత్తికి సంబంధించిన కంపెనీలతో భాగస్వామ్యం కోసం ఎదురు చూస్తున్నాం’’ అని తెలిపింది. స్టీల్ తయారీ సంస్థలతో అనుబంధం, అనుభవం ఉన్నవారెవరైనా బిడ్ వేయవచ్చునని స్పష్టం చేసింది. ‘‘స్టీలు తయారీకి సంబంధించిన ముడిపదార్థాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సరఫరా చేసి… దానికి బదులుగా స్టీల్ ఉత్పత్తులను తీసుకోవచ్చు. లేదా… వర్కింగ్ క్యాపిటల్ గా నగదు సమకూర్చితే దానికి బదులుగా స్టీల్ ఉత్పత్తులను సరఫరా చేస్తారని ఈవోఐలో ఉంది. అంటే కేంద్రం … స్టీల్ ప్లాంట్ వద్ద మూలధనం లేదని చెప్పడానికి ప్రయత్నించింది.
తల్చుకుంటే ముడి సరుకు ఉచితంగా కేటాయించగలిగే స్థితిలో కేంద్రం !
విశాఖ ఉక్కు ప్లాంట్ నేడు నష్టాల్లో కొనసాగడానికి ప్రధాన కారణం సొంతంగా గనులను కేంద్ర ప్రభుత్వం కేటాయించక పోవడమే. గనుల కేటాయింపు కోసం గత కొన్నేళ్లుగా ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు, కార్మిక సంఘాలు, ప్రజలు విజ్ఞప్తులు చేస్తున్నా, అనేక రూపాల్లో ఉద్యమిస్తున్నా కేంద్ర పెద్దలు ఆలకించడం లేదు. నిత్యం చైనాను దుమ్మెత్తిపోసే మోదీ ప్రభుత్వం దేశంలోని ముడి ఇనుములో 80 శాతం చైనాకు ఎగుమతి చేస్తోంది. దీంతో విశాఖ స్టీల్ ముడి ఇనుమును బహిరంగ మార్కెట్ లో ఎక్కువ ధరకు కొనుగోలు చేసి, నష్టాలకు గురికావలసి వస్తున్నది. చైనా ప్రభుత్వం తమ దేశంలోని గనుల్లో ఉన్న ఖనిజాన్ని మైనింగ్ కూడా చేయనవసరం లేకుండా మనం అమ్ముతుంటే కొంటున్నారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ నష్టాలకు మూల కారణం కేంద్రమే అని స్పష్టం అవుతుంది. ఈ నష్టాలకు కారణంగా కేంద్ర ప్రభుత్వాన్ని బోనులో నిలపాలి. కొందరు మైనింగ్ మాఫియా వాళ్లు చైనాకు, జపాన్ కు ఇనుప ఖనిజం అమ్ముకోవడానికి అనుమతిస్తున్న ప్రభుత్వం ప్రభుత్వ రంగ కంపెనీ వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించడం లేదు.
ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ లతో సహా దేశంలోని అన్ని స్టీల్ ప్లాంట్ లకు సొంతంగా గనులను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం ఇంతటి ప్రతిష్టాకరమైన ప్లాంట్ కు కేటాయించకుండా నష్ఠాల ఊబిలోకి త్రోసివేయడమే కాకుండా ఇప్పుడు ఏకంగా అమ్మాలని చూడటం ఈ ప్రాంత ప్రజలను వంచించడమే. 2000 సంవత్సరం తర్వాత దేశంలో ముడి ఇనుము ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నప్పటికీ 2015 వరకు స్టీల్ ప్లాంట్ లాభాల్లోనే కొనసాగింది. తదుపరి ఉత్పత్తి వ్యయం, ముడి సరుకు విపరీతంగా పెరగడం, పెట్టుబడిపై రుణాలు, నష్టాలు కలిపి రూ.22 వేల కోట్లపై వడ్డీలు చెల్లించాల్సి వస్తోంది. తద్వారా రూ. 4నుండి 5 వేల కోట్ల మేరకు నష్టాలు వస్తున్నాయి. 0తకుముందే గత కొన్నేళ్లుగా అంతర్జాతీయంగా కూడా ఉక్కు పరిశ్రమ తీవ్ర మాంద్యాన్ని ఎదుర్కొంటున్నది. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నా కాపాడుకునేందుకు కేంద్రం ముందుకు రాడవం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ సొంత గనుల కోసం ఒడిశా మినరల్ కార్పొరేషన్ లో ఐరన్ ఓర్ కోసం రూ. 361 కోట్లను పెట్టుబడిగా పెట్టింది. అయితే ఎన్డీయే ప్రభుత్వం లైసెన్స్ ను పునరుద్దరించక పోవడంతో ప్రయోజనం లేకుండా పోయింది. సొంత గనులు ఉంటే టన్ను రూ.1000 నుండి రూ.1500 లకే లభించే ముడి ఇనుము కోసం ఇప్పుడు రూ. 5 వేల నుండి రూ.7 వేల లోపు పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అంటే ఉత్పత్తి వ్యయంలో ఏకంగా 55 శాతం (అదనంగా రూ. 3 వేల కోట్లు) ముడి ఇనుము కోసం అదనంగా ఖర్చవుతోంది. సొంత గనులు ఏర్పాటు చేసుకొంటే ఈ రూ. 3 వేల కోట్లు ఆదా అయ్యేది. ఇదే జరిగితే అసలు నష్టాలనే మాట రాదని నిపుణులు చెబుతున్నారు.
స్టీల్ ప్లాంట్ అమ్మేయాలనే పట్టుదలతోనే రాజకీయ విన్యాసాలు !
ప్రతి ఏటా దేశం మొత్తం మీద నాణ్యమైన 73 లక్షల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలోని అన్ని ఉక్కు కర్మాగారాలకన్నా అత్యున్నతమైనది. దేశంలో అత్యంత అధునాతనమైన, సముద్ర తీరంలో వున్న ఏకైక సమగ్ర ఉక్కు కర్మాగారామిది. వెనుకబడిన ఉత్తరాంధ్రలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటును అడ్డుకోవాలని మొదటి నుండి పొరుగు రాష్ట్రాలతోపాటు ఢిల్లీలోని కొంతమంది పెద్దలు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. వాస్తవానికి 1989లో ఏర్పడిన నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలోనే ఎస్సార్ గుజరాత్, ఇతర కార్పొరేట్ సంస్థలకు రూ.11,500 కోట్లకు దీనిని అమ్మే ప్రయత్నం చేశారు. అయితే పార్టీలకు అతీతంగా పార్లమెంట్ సభ్యులు, ప్రజా, కార్మిక సంఘాలు చేసిన ఒత్తిడి కారణంగా దానిని నివారించగలిగారు. ఇప్పుడు మాత్రం ఎలాగైనా అమ్మేయాలని చూస్తున్నారు . అందుకే రాజకీయంగా రచ్చ చేస్తున్నారు. ఇదిగో అమ్మేశాం అంటే.. ఇదిగో ఆపేశామని ఎవరికి వారు రాజకీయాలు చేస్తున్నారు.
వెనక్కి తగ్గామనే ప్రకటనలు నమ్మాలంటే స్టీల్ ప్లాంట్ కాపాడే చర్యలు చేపట్టాలి !
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేశామని నమ్మించాలంటే ముందుగా ఆ ప్లాంట్ కు స్థిరత్వం ఇచ్ేచ ప్రయత్నాలు చేయాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంతంగా గనులు కేటాయించాలి. లేకపోతే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్), ఆర్ఐఎన్ఎల్ తో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలి. సెయిల్ దగ్గర 200 ఏళ్లకు సరిపడా ఉక్కు ఉత్పత్తికి అవసరమైన ఇనుప ఖనిజం ఉంది. దీనిద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాట పడుతుంది. ప్రభుత్వ రంగంలోని ఎన్ఎండీసీ నుండి స్టీల్ ప్లాంట్ అవసరాల మేరకు ముడి సరుకు కొంటున్నారు. అలా కాకుండా ఎన్ఎండీసీ ని ఆర్ఐఎన్ఎల్ లో విలీనం చేయడం ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ ను నష్టాల నుండి గట్టెక్కించవచ్చు. ఇలాంటి చర్యలు చేపట్టి… తాము ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లడం లేదని నిరూపిస్తేనే… జాతి సంపదపై కాస్త బాధ్యతగా ఉన్నట్లు. లేకపోతే రాజకీయం చేసినట్లే.
అయితే స్టీల్ ప్లాంట్ ను కేంద్రంగా చేసుకుని ఉక్కు సైతం కరిగిపోయే రాజకీయాలు.. రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. ప్రజలు తమ పార్టీల అభిమానాన్ని పక్కన పెట్టి కాస్త కళ్లు తెరిచి చూస్తే ఈ విషయం కళ్ల ముందే కనిపిస్తుంది. తమ రాజకీయ ఆసక్తుల కోసం ప్రజల్ని రెచ్చగొట్టాడనికి బుజ్జగించడానికి.. ఈ స్టీల్ ప్లాంట్ ను వాడేసుకుంటున్నారు. ఇది రాజకీయ పార్టీలు ప్రజలకు చేస్తున్న భారీ ద్రోహం. గురజాడ చెప్పినట్లు దేశమంటే మట్టి కాదోయ్ మనుషులు అంటే…. ఈ పార్టీలన్నీ కలిసి దేశానికి ద్రోహం చేస్తున్నట్లే..!