విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి వంద శాతం వాటాలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయానికి మరో పెద్ద అంశం దొరికినట్లయింది. ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న అధికార పార్టీలు ముందుగా కార్నర్ అవుతున్నాయి. ఏపీ భారతీయ జనతా పార్టీ నేతలు ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకం నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పది రోజుల్లో ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రుల్ని కలిసి… విశాఖ స్టీల్‌ను అమ్మవద్దని కోరుతామని ప్రకటించారు. సోము వీర్రాజు లాంటి నేతలు కూడా కేంద్ర నిర్ణయాన్ని సమర్థించలేదు. విశాఖకు చెందిన ఎమ్మెల్సీ మాధవ్ కూడా… అదే మాట మీద ఉన్నారు. అయితే అనూహ్యంగా ఎంపీ సుజనా చౌదరి మాత్రం… ఎవరేమనుకున్నా విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేయడం ఆగదని తేల్చి చెప్పేశారు.
సుజనా తప్ప బీజేపీ నేతలందరూ అమ్మకానికి వ్యతిరేకమే..!
కేంద్రం నిర్ణయం అంటే నిర్ణయమేనని… టీడీపీ, వైసీపీ ఆందోళన చేసినంత మాత్రాన ఆగదని ఆయన అంటున్నారు. పైగా ప్రైవేటీకరణ చేయడం అంటే.. ఫ్యాక్టరీని విశాఖ నుంచి విదేశాలకు తీసుకెళ్లిపోరని అక్కడే ఉంటుందని ఉద్యోగాలు, ఉపాధికి ఎలాంటి ఢోకా ఉండని ఆయన అంటున్నారు. అయితే ఇతర బీజేపీ నేతలు మాత్రం ఇలా అనుకోవడం లేదు. చివరికి బీజేపీ భాగస్వామ్య పార్టీ జనసేన కూడా విశాఖఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తోంది. నాదెండ్ల మనోహర్ ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేశారు. కేంద్రం నిర్ణయంతప్పు అని నేరుగా చెప్పకపోయినా చెప్పాల్సిన పద్దతిలో చెప్పారు. నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కోరుతామన్నారు. అంతిమంగా ఒక్క సుజనా చౌదరి తప్ప.. మిగతా బీజేపీ, జనసేన నేతలంతా ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగానే ఉన్నారు.
సూట్ కేస్ కంపెనీలతో జగనే కొనబోతున్నాడంటున్న టీడీపీ..!
భారతీయ జనతా పార్టీని ఏమీ అనని.. తెలుగుదేశం పార్టీ ఏపీ అధికార పార్టీని మాత్రం తీవ్ర స్థాయిలో కార్నర్ చేస్తోంది. వైసీపీ ఎంపీలు నోరు మెదపడం లేదని మండి పడుతోంది. లోకేష్ దగ్గర్నుంచిఅందరూ అదే విమర్శలు చేస్తున్నారు. అయ్యన్నపాత్రుడులాంటి నేతలు అసలు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కొనడానికి జగన్మోహన్ రెడ్డి సూట్ కేసు కంపెనీలు రెడీ చేశారని కూడా అంటున్నారు. ఇప్పటి వరకూ సంపాదించిన అక్రమ సొమ్ముతోనేదాన్ని కొంటారని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అది నిజం కాకపోతే.. ఏపీ ప్రభుత్వమే దానిని కొనుగోలు చేయాలని అంటున్నారు. ఈ విషయంలో వైసీపీని అనుమానించాల్సి వస్తోందని ఆయన ఘాటుగానే విమర్శిస్తున్నారు.
స్టీల్ ప్లాంట్‌పై మాట్లాడొద్దని ఎంపీలకు జగన్ ఆదేశం..!
ఇక వైసీపీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడిన చందంగా మారింది. ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వానికి ముందు నుంచీ సమాచారం ఉంది. గతంలో పోస్కో ప్రతినిధులు వచ్చి సీఎంను కలిసి వెళ్లారు కూడా. ఇప్పుడు అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు వ్యతిరేకించే పరిస్థితి లేదు. అందుకే ఎలా స్పందించాలో తెలియక సైలెంటయ్యారు. ఆ పార్టీ ఎంపీలు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో… స్టీల్ ఫ్యాక్టరీ గురించి జగన్మోహన్ రెడ్డి ఏమీ మాట్లాడవద్దన్నారంటూ… బాలశౌలి, పిల్లి బోస్ ఇద్దరూ మాట్లాడుకోవడం మీడియా కెమెరాల్లో హైలెట్ అయింది.అది సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యూలేట్అవుతోంది. అయితే విశాఖ ఎంపీ సత్యనారాయణ మాత్రం భిన్నంగా స్పందించారు. అవసరమైతే ఎంపీ స్థానానికి రాజీనామా చేస్తానంటూ భిన్నమైన రాగం ఆలపించారు.
రాజీనామాలు చేసి పోరాడదాం రమ్మని గంటా పిలుపు..!
కొన్నాళ్లుగా రాజకీయాల్లో సైలెంట్‌గా ఉంటున్న గంటాశ్రీనివాసరావుకు స్టీల్ ప్లాంట్ వివాదం కొత్త ఊపిరి ఇచ్చినట్లుగా ఉంది. ఆయన హఠాత్తుగా తెరపైకి వచ్చింది. ఢిల్లీ రైతుల స్థాయి ఉద్యమం నిర్వహిస్తామని కేంద్రానికి హెచ్చరికలు పంపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం తమ వ్యతిరేకత తెలియచేయాలని అంటున్నారు. అవసరమైతే పదవులన్నీ వదిలేసి పోరాడటానికి విశాఖ ప్రజాప్రతినిధులంతా సిద్ధం కావాలని ఆయన పిలుపునిస్తున్నారు. మొత్తానికి విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రంగా రాజకీయం చాలా జోరుగా రాజుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి.