తెలుగుదేశం నాయకుల్లో అసంతృప్తులు బయటపడిపోయాయి! బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో నాయకులు రెండులా చీలిపోయినట్టు తెలుస్తోంది. పరిస్థితి ఎంతవరకూ వచ్చిందంటే… బాలకృష్ణ అనుమతి లేకుండా కొంతమంది నాయకులు సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమౌతున్నారు. ఈ తరుణంలో బాలయ్య జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. తనకు తెలియకుండా పార్టీ వ్యవహారాలేవీ చక్కబెట్టడానికి వీల్లేదంటూ ఆయన హెచ్చరించాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇంతకీ.. హిందూపురంలో అనూహ్యంగా ఈ పరిస్థితి రావడానికి కారణం… బాలకృష్ణ పీఏ శేఖర్! నియోజక వర్గంలో బాలయ్య తరఫున అన్ని కార్యకలాపాలూ ఈయనే చక్కబెడుతూ ఉంటారు. అయితే, అతడి వ్యవహార శైలి పార్టీలో కొంతమంది నాయకులకు అస్సలు నచ్చడం లేదు. స్థానిక నేతలకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా, తనకు ఇష్టం వచ్చినట్టు వ్యహరిస్తూ ఉండటం కొంతమంది నేతలకు అసంతృప్తి కలిగిస్తోంది. దాదాపు రెండేళ్లుగా బాలయ్య పి.ఎ. తీరు ఇలానే ఉంటోందట. దీంతో తాజాగా ఆ అసంతృప్తి బయటపడింది.
తెలుగుదేశంలోని ఒక వర్గం నేతలు ఇటీవల రహస్యంగా ఓ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ తరువాత, ఈ నెల 5న మరో సభ పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వెంకటరాముడు, అంబికా లక్ష్మీనారాయణలు కార్యకర్తలతో తరచూ సమావేశం అవుతున్నారు. అయితే, తాము పార్టీకి వ్యతిరేకం కాదని చెబుతునే. పి.ఎ. తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణ చేస్తున్నారు. తాజా సభకు సంబంధించిన సమాచారం బాలయ్యకు తెలియగానే నేతలతో మాట్లాడారు. తనకు తెలియకుండా ఎలాంటి సభలూ సమావేశాలు నిర్వహించరాదంటూ ఆదేశించారు!
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఎప్పటికప్పుడు హిందూపురం వెళ్లూ వస్తున్న బాలయ్యకు తన పి.ఎ. గురించి ఇన్నాళ్లూ తెలీదా..? నిజానికి, గత ఏడాదే అతడి వ్యవహార శైలిపై చాలా కథనాలు వచ్చాయి. ఆ సందర్భంలో బాలయ్య స్పందించిన దాఖలాలు లేవు. ఇప్పుడు వ్యవహారం ఇక్కడికి వచ్చే వరకూ ఏం చేస్తున్నట్టు..? ఒక పి.ఎ. వల్ల నియోజక వర్గంలో పార్టీ నిలువునా చీలిపోతుంటే ఏం చేస్తున్నట్టు..? టీడీపీలో క్రమశిక్షణ చాలా ఎక్కువ అని చెప్పుకుంటారు కదా! అలాంటిది, స్థానిక ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా స్థానిక నేతలు పార్టీకి సంబంధించిన వ్యవహారాలపై సభలు పెట్టే స్థాయికి వచ్చేస్తే… ఏమని అర్థం చేసుకోవాలి..? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ తావిచ్చేట్టుగా పరిస్థితి మారుతోంది! పార్టీ వ్యవస్థాపకుడి కుమారుడి నియోజకవర్గంలోనే ఈ పరిస్థితా అని తమ్ముళ్లు ఆశ్చర్యపోతున్నారు!