రాజస్థాన్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు కుట్ర జరిగిందంటూ… అక్కడి ప్రభుత్వం ఆడియో టేపులు రిలీజ్ చేయడం.. అందులో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వాయిస్ ఉండటం రాజకీయంగా కలకలం రేపుతోంది. అవి ఫేక్ టేపులని..నిన్నటి వరకు ఎదురుదాడికి దిగిన.. భారతీయ జనతా పార్టీ.. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారనే వాదనతో తెర ముందుకు వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సివచ్చిందని… దానికి చట్టబద్ధమైన అనుమతులు తీసుకున్నారా అంటూ.. కాంగ్రెస్ పై ప్రశ్నల వర్షం కురిపింది. బాగా ఎదురు దాడి చేస్తున్నామని బీజేపీ అనుకుందేమో కానీ.. కాంగ్రెస్ దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుంది. నిన్నటి వరకూ.. ఫేక్ టేపులు అన్న బీజేపీ నేతలు.. ఇప్పుడు అవి నిజమని అంగీకరిస్తున్నారా.. అని కౌంటర్ ఇస్తోంది.
దీంతో బీజేపీ అటూ ఇటూ కాకుండా ఉండిపోయినట్లయింది. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయించాలంటూ.. బీజేపీ నేతలు కొత్త పాట అందుకున్నారు. ఇప్పటికే.. సీబీఐ, ఐటీ, ఈడీలను.. కాంగ్రెస్ పార్టీ బీజేపీ అనుబంధ సంఘాలుగా వర్ణిస్తూ ఉంది. సచిన్ పైలట్ తిరుగుబాటు చేసిన రోజునే.. రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లాట్ కుమారుడు.. బంధువులకు సంబంధించిన వారి ఇళ్లపై ఐటీ దాడులు నిర్వహించారు. గతంలో.. మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కూల్చేసినప్పుడు.. మాధవరావు సింధియా తిరుగుబాటు చేసినప్పుడు.. కర్ణాటక ప్రభుత్వాన్ని మార్చేసినప్పుడు కూడా.. ఇలాగే.. ఐటీ దాడులు జరిగాయి. కొన్ని చోట్ల సీబీఐ కూడా రంగంలోకి దిగింది. ఇప్పుడు.. రాజస్థాన్ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు జరిగిన ప్రయత్నాలపై సీబీఐ విచారణ కావాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతానికి రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ పోలీసులు దీన్ని దర్యాప్తు చేస్తున్నారు.
కూల్చే కుట్రలో భాగమయ్యారని.. కొంత మంది పైలట్ వర్గ ఎమ్మెల్యేలను ప్రశ్నించేందుకు వారు బస చేస్తున్న క్యాంప్‌ల వద్దకు కూడా వెళ్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వారు ఉండటంతో.. రాజస్థాన్ పోలీసులకు.. అక్కడ సహాయ నిరాకరణ ఎదురవుతోంది. దీంతో.. దీని వెనుక బీజేపీ ఉందని.. ఇంత కంటే ఏం ఉదాహరణలు కావాలని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. మొత్తానికి రాజస్థాన్ ప్రభుత్వాన్ని కూల్చాలనుకున్న ప్రయత్నం బెడిసికొట్టి.. మొత్తానికే.. బీజేపీ ఇమేజ్ను డ్యామేజ్ చేసే దిశగా కదులుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి.