‘మా’లో మొదలైన అలజడి ‘మా’ టీమ్ మొత్తాన్ని రెండు వర్గాలుగా చేసేసింది. ఒకటి నరేష్ వర్గం, రెండోది రాజశేఖర్ వర్గం. ‘మాలో గొడవలేం లేవు’ అని చెబుతున్నా – లోపల జరగాల్సిన తంతు జరిగిపోయింది. నరేష్‌పై విమర్శలు, ప్రతి విమర్శలతో కార్యవర్గ సమావేశం గందరగోళంగా మారినట్టు విశ్వసనీయ వర్గాల టాక్.
నరేష్‌పై ప్రధానంగా రెండు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
1. ‘మా’ కోసం సమయం కేటాయించడం లేదు.
2. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం
ఈ రెండింటిపైనా నరేష్ విశ్లేషణపూర్వకమైన వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. మా `మినిట్స్ బుక్`, పంచింగుల డేటా ఆయన ‘మా’ సభ్యుల ముందుకు తీసుకొచ్చారు. ‘మా’ కోసం ఎవరు ఎన్ని రోజులు ఛాంబర్‌కి వచ్చారో లెక్క వేసుకోమన్నారు. ఇక రెండో విషయం.. ఏక పక్ష నిర్ణయాలు. ఇప్పటి వరకూ ‘మా’ కోసం ఎన్ని నిర్ణయాలు తీసుకున్నారు? వాటిలో చర్చించి తీసుకున్నవెన్ని, అధ్యక్ష హోదాలో నరేష్ తీసుకున్నవెన్ని ? అనే విషయంపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ ఆరోపణ కూడా నిలబడలేకపోయింది.
జీవిత – రాజశేఖర్‌లు నరేష్ వర్గంలో నిలబడి గెలిచినవాళ్లు. నిజానికి ఆ ఇద్దరికీ `మా` ఎన్నికలలో నిలబడాలన్న ఆలోచనే లేదు. అయితే నరేష్ పట్టుబట్టి వాళ్లిద్దరినీ నిలబెట్టాడు. వాళ్లు మంచి మెజార్జీతో గెలిచి ‘మా’ ప్యానెల్లో కీలక సభ్యులయ్యారు. ఇప్పుడు వాళ్లే నరేష్ ని కార్నర్ చేయడం విశేషం. నరేష్ ఎన్నికలలో గెలిచి.. ‘మా’ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాడు. తనపై అవిశ్వాస తీర్మాణం పెట్టి గద్దె దింపడం అంత తేలికైన విషయం కాదు. అందుకే పెద్దలు జీవిత, రాజశేఖర్ వర్గాన్ని శాంతపరిచేందుకు ప్రయత్నించారని సమాచారం. ఏ విషయమైనా కూర్చుని మాట్లాడుకోవాలని, గొడవ పడితే.. అలుసైపోతారని సముదాయించార్ట. దాంతో… రాజశేఖర్ వర్గం వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.