నర్సీపట్నం డాక్టర్ సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన వ్యవహారం రాజకీయ దుమారానికి కారణం అయింది. ఎవరి వెర్షన్ వారు వినిపిస్తున్నాయి. ఎవరు ఎంత బలంగా వాయిస్ వినిపించగలరో.. వారి వాదన వినిపిస్తున్నారు. అయితే.. ఎవరూ.. రెండో వైపు అంశాన్ని చెప్పడం లేదు. మీడియా కూడా. అధికార పార్టీకి అండగా నిలిచే మీడియా.. డాక్టర్ మద్యం మత్తులో వీరంగం చేశారని.. స్థానికుల సమాచారంతోనే.. పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారని చెబుతున్నారు. ప్రతిపక్షానికి సపోర్ట్ చేసే మీడియా దళిత డాక్టర్‌పై పోలీసుల అమానుషం అని.. హోరెత్తిస్తున్నారు. ఈ రెండూ నిజాలే. అక్కడ డాక్టర్ అతి చేయబట్టే పోలీసులు వెళ్లారు. పోలీసులు కూడా ఓవరాక్షన్ చేయబట్టే రాజకీయం అయిపోయింది.
నర్సీపట్నం ఆస్పత్రిలో అనస్థీషియా డాక్టర్‌గా ఉన్న సుధాకర్..పీపీఈ కిట్లు ఇవ్వడం లేదని ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత హఠాత్తుగా ఆయన శనివారం విశాఖ రోడ్లపై కనిపించారు. తన కారులో వస్తూ మధ్యలో ఆగి.. మద్యం మత్తులో హల్ చల్ చేస్తూండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు 100కి ఫోన్ చేయడంతో స్థానికంగా ఉన్న పోలీసుల్ని అక్కడకు పంపారు. పోలీసులు వచ్చిన తర్వాత కూడా.. డాక్టర్ సుధాకర్ వెనక్కి తగ్గలేదు. హంగామా చేశారు. చొక్కా విప్పి హల్ చల్ చేశారు. ఎంతకూ ఆగకపోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే పోలీసులు ఇక్కడా.. సుధాకర్ ను మించి అత్యుత్సాహానికి వెళ్లారు. పెడరెక్కలు విరిచికట్టి.. చేతులు కట్టేసి.. లాఠీని చేతుల మధ్య పెట్టి… కొడుతూ.. తీసుకెళ్లారు. ఇదే.. ఈ ఘటన సంచసనాత్మకం అవడానికి కారణం అయింది. సందు ఇస్తే.. తప్పించుకుపారిపోయే నొటోరియస్ క్రిమినల్‌ను అరెస్ట్ చేసినట్లుగా పరిస్థితి ఉంది. ఓ డాక్టర్ పట్ల.. అంత తీవ్రంగా వ్యవహరించాల్సిన పరిస్థితి పోలీసులకు ఎందుకు వచ్చిందనేది చాలా మందికి అర్థం కాని విషయం. డాక్టర్ సుధాకర్.. ఆ సమయంలో నిస్సహాయుడిగానే కనిపించారు. ఆయన పోలీసుల్ని నెట్టివేయలేదు. కానీ ఆయన పట్ల పోలీసులు మాత్రం ధర్డ్ డిగ్రీని ప్రయోగించినంత పని చేశారు. పోలీసులు ఆయన మద్యం మత్తులో ఉన్నారని ప్రకటించారు. ఆయనకు మానసిక వ్యాధి ఉందని కూడా నిర్ధారించారు.
ఈ పోలీసుల అత్యుత్సాహమే.. ఇప్పుడు రాజకీయం అవుతోంది. డాక్టర్ సుధాకర్ న్యూసెన్స్ చేశారు.. అయినా ఆయనను అరెస్ట్ చేసే పద్దతి అది కాదు. అందుకే.. రియాక్షన్ వస్తోంది. రాజకీయ పార్టీలు దళిత వాదాన్ని ఎత్తుకున్నాయి. దళితుడైన సుధాకర్‌ను.. అలా ప్రభుత్వం హింసించడం సరి కాదని.. అంటున్నారు. రాజకీయ పార్టీలన్నీ ప్రభుత్వం.. పోలీసుల తీరుపై భయాందోళనలు కలిగించే రీతిలో విమర్శలు ప్రారంభించాయి. పోలీసులు అరెస్ట్ చేసేటప్పుడు హల్ చల్ చేసిన డాక్టర్ సుధాకర్ ఆస్పత్రికి తీసుకెళ్లేటప్పుడు మీడియాతో మాత్రం.. మేధావిలా మాట్లాడారు. దీన్ని కూడా విపక్షాలు ఉపయోగించకుంటున్నాయి. మొత్తానికి డాక్టర్ సుధాకర్ తన ప్రవర్తనతో మరోసారి రాజకీయ కలకలం రేపారు.