బీజేపీ నేతలు రాజకీయం కోసమే విమర్శిస్తారు కానీ ఢిల్లీలో అవార్డులు ఇస్తారని సీఎం కేసీఆర్ కూడా అంటున్నారు. కానీ బీజేపీ నేతలేమో అసలు అవార్డులే ఇవ్వకుండా ఇస్తున్నట్లుగా ప్రచార చేసుకోవడం ఏమిటని అంటోంది. నేరుగా కేంద్ర ప్రభుత్వ జల శక్తి మంత్రిత్వ శాఖనే స్పందించి టీఆర్ఎస్ మంత్రులు రాజకీయంగా చేసిన ప్రకటనను అధికారికంగా ఖండించింది. తెలంగాణలో ప్రతీ ఇంటికి మంచి నీళ్లు ఇస్తున్నామని.. ఈ విషయాన్ని కేంద్రం గుర్తించి.. గాంధీ జయంతి రోజు అవార్డు ఇస్తోందని టీఆర్ఎస్ మంత్రులు, హరీష్ రావు , ఎర్రబెల్లి ప్రతీ చోటా చెబుతున్నారు.
అయితే ఇదేదో తేడాగా ఉందనుకున్నారేమో కిషన్ రెడ్డి శుక్రవారం .. ఈ ప్రచారాన్ని ఖండించారు. తెలంగాణకు కేంద్రం ఎలాంటి అవార్డు ఇవ్వలేదన్నారు. తాను అలా అనడమే కాదు.. కేంద్రంతో ప్రకటన చేయించారు. కేంద్ర జలశక్తి శాఖ మిషన్ భగీరథకు జాతీయ అవార్డు ఇచ్చారనడాన్ని ఖండించింది. మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రం అసలు అంచనా వేయనేలేదని.. తెలంగాణలో 100% నల్లా నీటి కనెక్షన్లు ఇచ్చినట్లు కేంద్రం ధ్రువీకరించనేలేదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే 100 శాతం నల్లా నీటి కనెక్షన్లు ఇచ్చినట్లు నివేదిక ఇచ్చిందని కానీ.. కేంద్రం ధృవీకరించలేదన్నారు.
తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ పేరుతో ప్రాజెక్ట్ ప్రారంభించింది. ఆ తర్వాత కేంద్రం జల్ జీవన్ మిషన్ పేరుతో.. దేశంలోని ప్రతీ ఇంటికి నల్లా నీరు అందించే లక్ష్యంతో పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకాన్ని ఎప్పటి నుంచే అమలు చేస్తున్నందున.. తాము జల్ జీవన్ మిషన్ కింద లక్ష్యాన్ని పూర్తి చేశామని తెలంగాణ ప్రబుత్వం కేంద్రానికి నివేదిక సమర్పించింది. దీనిపైనే ఇప్పుడు పొలిటికల్ పంచాయతీ పెట్టుకున్నారు.