వైస్ చాన్సలర్ అంటే ఓ యూనివర్శిటీ మొత్తానికి మార్గనిర్దేశుడు. ఆయనే దారి తప్పితే ఇక యువత అంతా దారి తప్పినట్లే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో యూనివర్శిటీల పరిస్థితి ఇంతే ఉంది. ప్రభుత్వం కూడా.. వారు చేయాల్సిన పని చేయకుండా… నైతికతకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. వారిని ఆ దిశగా ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. అలా చేస్తేనే పదవి నిలబడుతుందని సంకేతాలు ఇస్తోంది. ఫలితంగా వీసీలందరూ వైసీపీ వీసీలుగా మారిపోయారు. నిజానికి వీరిని గవర్నర్ నియమించలేదు. ప్రభుత్వం ఇంచార్జ్‌లుగా నియమించింది. వారే విలువలకు తిలోదకాలిస్తున్నారు. విద్యా ప్రమాణాలను దిగజారుస్తున్నారు.
జగన్ భజన చేయడమే వీసీలకు కండక్ట్ సర్టిఫికెట్..!
కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ వైస్ చాన్సలర్ హోదాలో ఉన్న పెద్దాయన కర్నూలుకు వెళ్లి మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ వీసీ అంటే.. ఆయన వైద్య రంగంలో తలమునకలుగా ఉంటారని.. క్షణం తీరిక లేకుండా ఉంటారని అనుకుంటారు. కానీ ఆయన కూడా అచ్చంగా వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తూ ఉంటారు. జగన్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు చెప్పే డైలాగులు చెబుతూ కనిపించారు. జగన్ మళ్లీ వస్తాడని.. తప్పులు పట్టించుకోకూడదని.. ఇలా రకరకాలుగా చెప్పారు. అసలు ఆయన చేసే పనికి.. చేయాల్సిన పనికి.. చేస్తున్న వ్యాఖ్యలకు పొంతన ఉందా ..? లేనే లేదు. కానీ ఆయనకు పదవి కాపాడుకోవడానికి అదొక్కటమే మార్గంగా మారింది.
కుల,రాజకీయాల్లో రాటుదేలిపోయిన ఓయూ వీసీ..!
నిన్నటికి నిన్న విశాఖలో రెడ్డి సంఘం సమావేశాన్ని వైసీపీ నేతలు ఏర్పాటు చేసుకుంటే ఆంధ్రా యూనివర్శిటీ వీసీ ప్రసాద్ రెడ్డి వచ్చేేశారు. వీసీ హోదాలో ఉండి కుల మీటింగ్‌కు అదీ కూడా వైసీపీ మీటింగ్‌కు రావడం ఏమిటని అందరూ నోళ్లు నొక్కుకున్నారు. అయితే ఆయన చాలా రోజులుగా వైసీపీ నేతలానే వ్యవహరిస్తూ ఉంటారు. యూనివర్శిటీలోనూ రాజకీయాలే చేస్తూంటారు. వైసీపీని.. జగన్ ను బహిరంగంగా పొగుడుతూ ఉంటారు. ప్రభుత్వ పెద్దలను పొగుడుతూ.. సామాజికవర్గం అండ చూసుకుని ఆయన నైతిక విలువలకూ తిలోదకాలిస్తున్నారు. అలా ఉంటేనే పదవి నిలబడుతుందని ఆయన నమ్ముతున్నారు. ఆయన నమ్మకమే నిజమవుతోంది. గౌరవనీయమైన వీసీ పోస్టులో ఉండి.. సమాజంలో బాధ్యతగా మెలగాలని చెప్పాల్సిన పెద్దలు కూడా.. ఆయన అలా ప్రవర్తించడమే పెద్ద సర్టిఫికెట్ అన్నట్లుగా ప్రోత్సాహం ఇస్తున్నారు.
వైఎస్ భజనల్లో పీహెచ్‌డీలు చేసేసిన ఏఎన్‌యూ రాజశేఖర్..!
ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఇంచార్జ్ వైస్ చాన్సలర్ గురించి ఎంత తక్కువ చెబితే విద్యారంగానికి అంత గౌరవం. ఆయన ఏకంగా క్యాంపస్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం పెట్టించారు. రిపబ్లిక్ డే వంటి వేడుకల్లోనూ వైసీపీ పాటలు పెట్టి విద్యార్థులతో నృత్యాలు చేయిస్తారు. వైసీపీ పనులు చేయించడానికి విద్యార్థుల్ని పురమాయిస్తారు. ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్లను క్యాంపస్ నుంచి తరిమేస్తారు. ఆయన లీలలు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇతర యూనివర్శిటీల వీసీలు కూడా ఏం తక్కువ తినలేదు. అంత ఎందుకు.. యూనివర్శిటీ పాలక మండళ్లు కూడా ఒక కులంతో నింపేశారు. అక్కడ రాజకీయాలు తప్ప.. విద్యా వ్యవస్థ మెరుగుకోసం ప్రయత్నం చేస్తారనుకోవడం అత్యాశే.
విద్యావ్యవస్థ పతనానికి అందరూ బాధ్యులే..!
విద్యారంగంలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగితేనే వైస్ చాన్సలర్‌గా చాన్స్ వస్తుంది. ఇది ఒకప్పుడు. ఇప్పుడు అధికార పార్టీకి ఎంత ఎక్కువగా బాకా ఊదితే.. అంత గొప్ప యూనివర్శిటీకి వీసీగా పోస్ట్ వస్తుంది. కనీసం ఇంచార్జ్ గా అయినా చాన్స్ దక్కుతుంది. వీసీ పదవి దక్కిన తర్వాత పేరు మోసిన ఆచార్యులు కూడా.. తమ నేర్చుకున్న చదువుకు… పాటించాల్సిన సంస్కారానికి మధ్య తేడా చూపించడం లేదు. వారికి అలాంటి పరిస్థితులు కల్పిస్తున్నారు. చివరికి బాపట్ల అగ్రికల్చరల్యూనివర్శిటీ వీసీపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా చేసింది. రాజకీయ పార్టీలు విద్యావ్యవస్థను కాపాడితే.. అది సమాజాన్ని కాపాడుతుంది. కానీ ఏపీలో దానికి రివర్స్‌లో జరుగుతోంది.