కొత్త నేతలను చేర్చుకోవాలన్న ఆరాటంతో తెలంగాణ బీజేపీ… సొంత ఇంట్లో కుంపటి పెట్టుకుంటోంది. కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు.. తెలంగాణ బీజేపీలో ప్రారంభమయ్యాయి. ఈటల రాజేందర్‌ను పార్టీలో చేర్చుకోవడంపై ఓ వర్గం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీజేపీలో ముసలం ప్రారంభమయింది. అక్కడ బీజేపీలో అంతా.. వలస నేతలే బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. ముఖ్యంగా మాజీ ఎంపీ గడ్డం వివేక్ .. మొత్తం రాజకీయాల్ని తన గుప్పిట్లో పెట్టుకున్నారు. కరీంనగర్ నుంచి ఈటల రాజేందర్‌ను టీఆర్ఎస్లోకి తీసుకు వెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. దీంతో.. ఇప్పటికే బీజేపీలో ఉన్న పలువురు నేతలు అసంతృప్తికి గురవుతున్నారు.
ముఖ్యంగా హుజూరాబాద్ నియోజకవర్గానికే చెందిన పెద్దిరెడ్డి… బహిరంగంగానే నిరసన స్వరం వినిపించారు. ఈటల వస్తే తన పరిస్థితేమిటని ఆయన మండిపడ్డారు. ఆ తర్వాత ఇతర నియోజకవర్గాలకు చెందిన నేతలు తెరపైకి వచ్చారు. టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన సోమారపు సత్యనారాయణ, గుజ్జుల రామకృష్ణారెడ్డి వంటి వారు.. బీజేపీలో గ్రూప్ రాజకీయాలు ప్రారంభించారు. దీంతో ఈటల వ్యవహారం బీజేపీకి తలనొప్పిగా మారింది. ఢిల్లీలో నాలుగు రోజుల పాటు.. బీజేపీ పెద్దలతో చర్చలు జరిపి.. తనను వేటాడుతున్న టీఆర్ఎస్ను వేటాడేలా ప్లాన్ రెడీ చేసుకున్నారని.. ఆ తర్వాతే బీజేపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెబుతున్నారు.
ఎనిమిదో తేదీన ఈటల బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారు చేసుకున్నారు. నాలుగో తేదీన అంటే శుక్రవారం రోజున ఆయన ఆయన ఎమ్మెల్యే పదవితో పాటు టీఆర్ఎస్కు రాజీనామా చేయనున్నారని … మీడియాకు సమాచారం ఇచ్చారు. ప్రెస్‌మీట్ పెట్టి.. తనను కేసీఆర్ ఎలా టార్గెట్ చేసింది.. బీజేపీలో ఎందుకు చేరుతున్నదీ వివరించే అవకాశం ఉంది. ఈటల రాకపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వారందర్నీ బుజ్జగించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.