తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్వహించే ఆయుత చండీయాగం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఈనెల 23 నుంచి 27 వరకు తన ఫాం హౌస్ లో వైభవంగా యాగం చేయడానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి అతిరథ మహారథుల్లాంటి రాజకీయ నాయకులు తరలివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్, ప్రధాని మోడీ సహా ప్రముఖ నేతలందరినీ ఆహ్వానించే పనిలో బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఈ యాగానికి వస్తానని స్వయంగా ప్రకటించారు. ఇంకా అనేక మంది కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అనేక పార్టీల జాతీయ నాయకులను కేసీఆర్ ఆహ్వానిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమానికి మద్దతిచ్చిన, చిన్న రాష్ట్రాల భావనతో ఏకీభవించిన పార్టీల నాయకులందరినీ పేరు పేరునా ఆహ్వానించాలనేది కేసీఆర్ ఉద్దేశం. తద్వారా జాతీయ స్థాయిలో ఒక ప్రముఖ నాయకుడిగా ఆయన కూడా గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఉమ్మడి ఏపీలో ఒకప్పుడు ఎన్టీఆర్ జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందారు. ఏకంగా నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు.
తర్వాతి కాలంలో చంద్రబాబు కూడా జాతీయ స్థాయిలో క్రియాశీలక పాత్ర పోషించారు. దక్షిణాదికి చెందిన దేవెగౌడను ప్రధానిని చేయడంలో చంద్రబాబుదే కీ రోల్. అప్పట్లో యునైటెడ్ ఫ్రంట్ ద్వారా కొంత కాలం జాతీయ స్థాయిలో చక్రం తిప్పారు.
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పారిశ్రామికంగా ముందుకు తీసుకుపోవడానికి చురుగ్గా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనేక జాతీయ, అంతర్జాతీయ బడా కంపెనీలు హైదరాబాదులో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి. ఈ సమయంలో కేసీఆర్ చండీయాగానికి జాతీయ స్థాయి నేతలు తరలివస్తే అది అపూర్వ రాజకీయ సంగమం అవుతుంది. అనూహ్యమైన రాజకీయ సమ్మేళనంగా అభివర్ణించ వచ్చంటున్నారు పరిశీలకులు.
పెద్ద సంఖ్యలో వచ్చే జాతీయ స్థాయి నాయకులతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు గులాబీ శ్రేణులు చెప్తున్నాయి. వీవీఐపీలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు పక్కాగా జరుగుతున్నాయి. ఉద్యమ నాయకుడిగా ఇప్పటికే గుర్తింపు ఉన్న కేసీఆర్, ఇప్పుడు రాష్ట్ర హితం కోసం యాగం చేయడం ద్వారా, పలువురు రాజకీయ నాయకులను ఆహ్వానించడం ద్వారా జాతీయ స్థాయిలోనూ ప్రత్యేకతను సొంతం చేసుకునే అవకాశం ఉంది.