అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిపై ఎలాంటి వ్యూహం అమలు చేశారో.. అచ్చంగా.. పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి.. కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై అమలు చేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. ఇందులో. . పోలీసులు పావుగా మారారు. ఉదయం పోలీసుల నుంచి.. మీడియాకు ఓ సందేశం వచ్చింది. అదేమిటంటే.. సందీప్ రెడ్డి అనే యువకుడ్ని పట్టుకున్నామని.. ఆయన దగ్గర పెద్ద మొత్తం నగదుతో పాటు మూడు ల్యాప్ ట్యాప్‌లు స్వాధీనం చేసుకున్నామని.. మీడియాకు లీక్ ఇచ్చారు. అధికారికంగా కాదు. దీంతో.. పాటు.. ఆ సందీప్ రెడ్డి.. కొండా విశ్వేశ్వర్ రెడ్డికి అనుచరుడు… చేవెళ్ల నియోజకవర్గంలో.. డబ్బు పంపిణీ బాధ్యతను ఆయన చూస్తున్నారని.. ఆయన చేతుల మీదుగా రూ. 15 కోట్ల రూపాయల పంపిణీ జరిగిందని కూడా.. ఆ మీడియా లీక్‌లో ఉంది. దీంతో… మీడియా చానెళ్లు బ్రేకింగుల మీద బ్రేకింగులు వేసి హడావుడి చేశాయి.
తీరా చూస్తే.. ఆ సందీప్ రెడ్డి.. అసలు.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి అనుచరుడు కాదని తేలిపోయింది. పోలీసులు సోదాలు చేస్తూండగా.. ఓ రూ. పది లక్షల నగదుతో మాత్రం దొరికారని.. అది కూడా ఆయన వ్యక్తిగత,కుటుంబ వేడుకల కోసం.. తీసుకెళ్తున్నారని తేలినట్లు తేలింది. అయితే పోలీసులు మాత్రం.. ఈ సందీప్ రెడ్డి.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఏదో … కోట్లకు కోట్లు గుమ్మరించి ఓట్లు కొనుగోలు చేస్తున్నట్లు లీకులు ఇచ్చారు. అయితే అధికారిక ప్రకటన మాత్రం అలా లేదు. పోలీసులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, దాసోజు శ్రవణ్ వెంటనే వెళ్లి ఈసీకి ఫిర్యాదు చేశారు. నా అనుచరుడి వద్ద రూ.10 లక్షలు దొరికాయని… నాపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భారీ మెజార్టీతో గెలుస్తాననే భయంతో ఇలా చేస్తున్నారని ఆరోపించారు.
కొండాకు సంబంధించిన వ్యక్తి దగ్గర రూ.10 లక్షలు దొరికాయని.. నిరూపిస్తే మేం ముక్కు నేలకు రాస్తామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ సవాల్ చేశారు. మొత్తానికి తెలంగాణ పోలీసులు తీరు.. అత్యంత వివాదాస్పదంగా మారుతోంది. ఏపీ ఎన్నికల్లోనూ వారు జోక్యం చేసుకున్న వ్యవహారం ఇప్పటికే చర్చనీయాంశమయింది. తాజాగా.. కాంగ్రెస్ అభ్యర్థుల వ్యక్తిత్వ హననానికి కూడా.. పోలీసులు కారణంగా మారుతున్నారనే విమర్శలు ప్రారంభమయ్యాయి.