‘మా’ రగడ మామూలుగా లేదు. అధ్యక్షుడిగా ఉన్న నరేష్‌ని దించేయడానికి మాస్టర్ స్కెచ్ మొదలైపోయింది. నరేష్, రాజశేఖర్ మధ్య వచ్చిన విబేధాలు, చినికి చినికి గాలివానగా మారి, ఇప్పుడు నరేష్ పదవికే ఎసరు తెచ్చాయి. అధ్యక్షుడిగా నరేష్ లేకుండానే `మా` జనరల్ బాడీ మీటింగ్ జరిగిపోయింది. అందులో కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో ప్రధాన చర్చ అంతా నరేష్ వ్యవహార శైలి గురించే జరిగిందట. `మా` కార్యవర్గంలో 26మంది సభ్యులు. 18 మంది మద్దతు రాజశేఖర్ వర్గానికి ఉంది. వీరంతా… నరేష్‌ది దించడానికి కావల్సిన మద్దతు కూడగడుతున్నారు. అధ్యక్షుడి పదవీకాలం రెండేళ్లు. అయితే మధ్యలో దించేసే అధికారం సభ్యులకు ఉంది. అలా జరగాలంటే 26మంది కార్యవర్గ సభ్యులంతా మూకుమ్ముడిడిగా ఓ తీర్మాణం చేయాలి. ప్రస్తుతం అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. `మా` లా బుక్‌లో అధ్యక్షుడిని తొలగించడానికి ఎన్ని మార్గాలున్నాయి? వాటికి చట్టబద్ధత ఎంత? అనే విషయాలపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే…. ఈ వ్యవహారం తొలగింపు వరకూ వెళ్లడం మంచిది కాదని, తనపై ఉన్న వ్యతిరేకత గ్రహించిన నరేష్ స్వయంగా పదవి నుంచి తప్పుకోవడం మేలని, అది `మా` అధ్యక్ష పీఠానికి కూడా మంచిదని పెద్దలు భావిస్తున్నారు. ఇండ్రస్ట్రీలోని పెద్దల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి, వాళ్ల అభిప్రాయం స్వీకరించిన తరవాతే… నరేష్‌పై అభిశంసన తీర్మాణం ప్రవేశ పెట్టాలని భావిస్తున్నారు. మొత్తానికి నరేష్ కుర్చీ కదులుతోంది. తనపై వ్యతిరేకత గ్రహించి నరేష్ ఈ పదవి నుంచి తప్పుకుంటాడో, లేదంటే.. దించేసే వరకూ తెచ్చుకుంటాడో, పెద్దలు ఓ రాజీ కుదిర్చి – ఈ వ్యవహారాన్ని సర్దుబాటు చేస్తారో చూడాలి.