కర్ణాటక మాజీ ముఖ్య మంత్రి, జనతా దళ్ పార్టీ అధినేత కుమార స్వామి ఎం.పి సుమలత పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు కుమార స్వామి ని చీల్చి చెండాడుతూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే..
వివాదం ఎక్కడ మొదలైంది:
నటి సుమలత తెలుగువారికి కూడా ఎంతగానో సుపరిచితురాలు. కన్నడ నటుడు అంబరీష్ ని పెళ్లి చేసుకున్న సుమలత, ఆయన మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ కి అంబరీష్ ఎంతగానో సేవ చేసినప్పటికీ, కాంగ్రెస్ సుమలత కు మాండ్య ఎంపీ టికెట్ ఇవ్వలేకపోయింది. దీంతో 2019 లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన సుమలత జనతాదళ్ పార్టీ అధినేత కుమార స్వామి కుమారుడు నిఖిల్ కుమార స్వామిని ఓడించి ఎంపీగా విజయం సాధించారు. అప్పటి నుండి వీరిద్దరి మధ్య ఏదో ఒక మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.
ఆ మధ్య సుమలత కేఆర్ఎస్ ఆనకట్ట కు పగుళ్లు ఉన్నాయని, దీని వల్ల నీళ్లు లీక్ అవుతున్నాయని, యథేచ్ఛగా కొనసాగుతూ ఉన్న ఇసుక తవ్వకాలే దీనికి కారణం అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యల ద్వారా సుమలత పరోక్షంగా కుమారస్వామి ని టార్గెట్ చేశారు అన్న విశ్లేషణలు వినిపించాయి. కేఆర్ఎస్ డ్యాం గా పిలవబడే కృష్ణ రాజ సాగర డ్యాం దక్షిణ కర్ణాటక ప్రాంతానికి జీవ నాడి. ఇది కావేరి నదికి అడ్డంగా నిర్మించబడింది.
కుమారస్వామి అభ్యంతరకర వ్యాఖ్యలు:
సుమలత వ్యాఖ్యల పై స్పందిస్తూ కుమార స్వామి మహిళా ఎంపీ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. నీరు వృథా కాకుండా ఉండటానికి , పగుళ్లను కప్పి పుచ్చడానికి కృష్ణరాజ సాగర (కెఆర్ఎస్) ఆనకట్ట ద్వారాల వద్ద సుమలత వెళ్లి పడుకోవాలని కుమారస్వామి వ్యాఖ్యానించడం వివాదానికి దారి తీసింది. మహిళా ఎంపీ పై అసభ్యకరమైన అర్థం వచ్చేలా కుమార స్వామి వ్యాఖ్యలు చేశారంటూ కర్ణాటక మహిళా సంఘాలు ఆయన పై విరుచుకు పడ్డాయి.
వ్యాఖ్యల పై స్పందించిన సుమలత
తన పై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన కర్ణాటక మాజీ ముఖ్య మంత్రి హెచ్డి కుమార స్వామి పై ఎంపి సుమలత విరుచుకు పడ్డారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన సుమలత మహిళా కమిషన్ కు వెంటనే ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ ప్రకటన అతని మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోంది అని, మాండ్యలో కుమార స్వామి కొడుకు నిఖిల్ కుమారస్వామి తన చేతిలో ఓడిపోవడం వల్ల కలిగిన గాయాలు ఇంకా నయం కాలేదేమో అని వ్యాఖ్యానించారు సుమలత. అంతే కాకుండా డ్యామ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక తవ్వకాల గురించి తాను మాట్లాడితే తన వ్యాఖ్యల ని విమర్శించడం ద్వారా కుమార స్వామి అవినీతిపరులకు మద్దతు ఇస్తున్నాడని ఆమె కౌంటర్ ఇచ్చారు.
తన దగ్గర సుమలత కు చెందిన ఆడియో లీక్ ఉందన్న కుమార స్వామి, సుమలత కౌంటర్
అయితే ఈ వివాదం అక్కడి తో ఆగలేదు. సుమలత వ్యాఖ్యల పై కుమార స్వామి తిరిగి స్పందించారు. ఆవిడ కు చెందిన ఒక ఆడియో లీక్ తన దగ్గర ఉందని, ఎన్నికలకు ముందు దానిని బయటపెడతానని, అప్పుడు అందరి బండారాలు బయటపడతాయని కుమార స్వామి వ్యాఖ్యానించారు.
దీని పై దీటు గా స్పందించిన సుమలత, ఎన్నికల కు ఇంకా రెండేళ్లు సమయం ఉందని, అప్పటి దాకా వేచి ఉండాల్సిన అవసరం లేదని, కుమార స్వామికి దమ్ముంటే ఆడియో ఇప్పుడే బయట పెట్టాలని సుమ లత చాలెంజ్ చేశారు. బహుశా, లేని ఆడియో ని కొత్తగా సృష్టించడానికి, మార్ఫింగ్ చేయడానికి, స్పెషల్ ఎఫెక్ట్స్ జత చేసి ఫేక్ ఆడియో ని సృష్టించడానికి కుమార స్వామి కి రెండేళ్ల సమయం కావాలేమో అని ఆమె ఎద్దేవా చేశారు.
ఏది ఏమైనా మాజీ ముఖ్యమంత్రి ,ఒక పార్టీ అధినేత స్థాయిలో ఉన్న కుమారస్వామి మహిళా ఎంపీ పై చేసిన వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయి అన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది