భారత రాష్ట్ర సమితికి చెందిన కీలక నేత కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేలను కొనేందుకు కావాల్సినంత డబ్బు ఇస్తామని బిల్డర్లు చెబుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో రాజకీయం రాజుకుంది. దమ్ముంటే ఆ పని చేయండి అని కాంగ్రెస్ నేతలు సవాల్ చేస్తున్నారు. అయితే ఈ రెండు పార్టీల మధ్యలో ఇరుక్కుపోయింది మాత్రం బిల్డర్లు. ఈ బిల్డర్లు ప్రత్యేకంగా ఎవరో చెప్పలేదు కానీ హైదరాబాద్లో ప్రభుత్వాలను మార్చాలనే ఆలోచన చేసేంత స్థాయి బిల్డర్లు చాలా తక్కువ మంది ఉంటారు.
కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పిన మాటలు నిజమేనని ప్రభుత్వం నమ్మితే బడా బిల్డర్లకు చాలా సమస్యలు వస్తాయి. ఎందుకంటే పది సంవత్సరాల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ముఖ్యులతో హైదరాబాద్లోని బడా రియల్ ఎస్టేట్ సంస్థలన్నీ సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాయి. వ్యక్తిగతంగానూ సన్నిహితంగా ముద్ర పడ్డారు. ఇప్పుడు వారిని ప్రభుత్వం టార్గెట్ చేస్తే మొదటికే మోసం వస్తుంది.
అందుకే బిల్డర్లు తమను రాజకీయాల్లోకి లాగొద్దని అంటున్నారు. ప్రభుత్వంలో ఎవరు ఉన్నా.. తమకు ఒకటే అని.. నిబంధనల ప్రకారం తాము వ్యాపారం చేసుకుంటాం కానీ రాజకీయాల్లోకి తలదూర్చబోమని సంకేతాలు పంపుతున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పిన బిల్డర్లలో తాము లేవని చెబుతూ ప్రభుత్వ పెద్దలకు సందేశాలు పంపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం పూర్తి సమాచారం సేకరించే అవకాశం ఉంది. ఎవరైనా ఇలాంటి మాటలు ..ప్రతిపాదనలు బీఆర్ఎస్ పెద్దల వద్ద పెట్టినట్లుగా ఉంటే మాత్రం ఆయా సంస్థలకు చిక్కులు తప్పకపోవచ్చని అంచనా వేస్తున్నారు.