‘ పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఆయన్ని మార్చండి. అప్పుడే పార్టీకి జవసత్వాలు వస్తాయి. లేకపోతే మూడేళ్లు కాదు కదా… 30 ఏళ్లు అయినా పార్టీ అధికారంలోకి రాదు’ ఇవీ తెలంగాణ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుల మనోవేదన. పార్టీ అధ్యక్షుడి ఎంపికపై సీనియర్లతో పాటు క్షేత్రస్ధాయి కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకునేందుకు వచ్చిన బీజేపీ ప్రధాన కార్యదర్శి అనీల్ జైన్, జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండ వద్ద తెలంగాణ నాయకుల మనోభావన. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా డాక్టర్ కే.లక్ష్మణ్ పూర్తిగా విఫలమయ్యారని, పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడంలో ఆయన సఫలం కాలేదంటూ జాతీయ నాయకుల వద్ద స్ధానిక నాయకులు కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. బీసీ వర్గానికి చెందిన డాక్టర్ కే.లక్ష్మణ్ తెలంగాణలో ఆ వర్గాలను కూడా పార్టీ వైపు తిప్పలేకపోయారని పార్టీ సీనియర్లు అధిష్టానం దూతల వద్ద ప్రస్తావించినట్లు చెబుతున్నారు. రెండు రోజులుగా హైదరాబాద్ లో మకాం వేసిన పార్టీ జాతీయ పరిశీలకులు ఇద్దరూ దాదాపు 50 మంది సీనియర్ నాయకులు, వివిధ జిల్లాలకు చెందిన సీనియర్లతో చర్చించినట్లు సమాచారం. ఈ 50 మంది నాయకుల్లో అత్యధికులు అధ్యక్ష పదవి నుంచి డాక్టర్ లక్ష్మణ్ తప్పించాలనే డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు. అధ్యక్షుడిగా డాక్టర్ లక్ష్మణ్ హైదరాబాద్ కే పరిమితం అయ్యారని, జిల్లాల్లో పర్యటించడం కాని, పార్టీ పటిష్టత కోసం కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడం వంటివి కాని చేయలేదని అధిష్టానం దూతలకు స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. గతంలో అధ్యక్ష పదవిని ఎవరికి ఇవ్వాలనేది ఢిల్లీలోనే నిర్ణయించే వారని, ఇప్పుడు ఆ పద్దతికి స్వస్తి పలికి క్షేత్రస్ధాయిలో అందరి అభిప్రాయాలు తీసుకుని వారి నిర్ణయం మేరకే అధ్యక్ష ఎంపిక జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అధిష్టానం పంపిన దూతలు కూడా తెలంగాణకు చెందిన సీనియర్ నాయకులు ఒక్కోక్కరితో విడివిడిగా చర్చించారని అంటున్నారు. అధ్యక్ష పదవి రేసులో దాదాపు 10 మంది ఉన్నట్లు సమాచారం. వీరు కూడా అధిష్టానం పంపిన నాయకులతో తమ అభ్యర్ధిత్వాలను పరిశీలించాలని వినతి పత్రాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. మరొక వర్గం పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న వారికే అధ్యక్ష పదవి ఇవ్వాలని, మరో పార్టీ నుంచి వచ్చిన వారికి ఆ పదవి ఇవ్వరాదంటూ డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు.