తెలంగాణలో విచిత్ర పరిస్థితి నెలకొంది. కేంద్రంలో అధికార పార్టీ, రాష్ట్రంలోని అధికార పార్టీ పరస్పరం పోరాడుతున్నాయి. రాజకీయంగా అది సహజమే కానీ అందుకు వారు ఎంచుకున్న “ప్రజా సమస్యే” ఇప్పుడు వారి రాజకీయానికి ఏదో తేడా ఉందన్న అభిప్రాయం కల్పించేలా చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో బర్నింగ్ ఇష్యూ పంట కొనుగోలు. కేంద్రం కొనడం లేదని టీఆర్ఎస్.. రాష్ట్రం కొనడం లేదని బీజేపీ రోడ్డెక్కుతున్నాయి. పరస్పరం దాడులు చేసుకుని ఉద్రిక్తతలు పెంచుకుంటున్నారు. ఎలా అయినా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మారిందని నిరూపించాలని తాపత్రయ పడుతున్నారు. ఆ రెండు పార్టీల నేతలు కూడా ఏ మాత్రం తగ్గడం లేదు.
రాజకీయాల్లో ఇద్దరి మధ్యనే పోటీ జరుగుతోంది అన్న ఫీలింగ్ తీసుకు వస్తే.. దూరంగా ఉన్న మూడో పార్టీని ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ పార్టీ ఓటర్లు కూడా ఓడిపోయే పార్టీకి ఓటెందుకు వేయడం అని.. ఓడించాలనుకున్న పార్టీకి ఓట్లేస్తున్నారు. హుజురాబాద్, దుబ్బాకల్లో అదే తేలింది. అక్కడ జరిగిన రాజకీయం బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్. అందుకే కాంగ్రెస్ పార్టీని ఓటర్లు పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పుడు అదే రాజకీయాన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నట్లుగా రెండు రాజకీయ పార్టీల వ్యూహాలను చూస్తే అర్థమైపోతుంది. బీజేపీకి పెద్దగా బలం లేని ప్రాంతాల్లో బండి సంజయ్ యాత్రలు పెట్టుకోవడం.. అక్కడ ఉద్రిక్తతలు సృష్టించడం.. దాన్ని స్టేట్ ఇష్యూగా మార్చే ప్రయత్నం చేయడం అంతా వ్యూహాత్మకంగానే జరుగుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఈ రెండు పార్టీల రాజకీయాలను ఎదుర్కోవడంలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడిపోయింది. వరి ఇష్యూలో రెండు పార్టీల బాధ్యత ఉన్నా.. కౌంటర్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ సైలెంట్ అయిపోయింది. అంతర్గత సమస్యలతో కొట్టు మిట్టాడుతోంది. ఆ పార్టీ దుస్థితిని అర్థం చేసుకుని.. కాంగ్రెస్ ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఎదగకుండా చేయాలన్న లక్ష్యంతో బీజేపీకి సాయం చేస్తున్నట్లుగా టీఆర్ఎస్ తీరు ఉందన్న అభిప్రాయం ఉంది.అది కేసీఆర్కు మంచిదో కాదో తెలియదు కానీ.. ఆయన బీజేపీకి మాత్రం ఎవరూ చేయలేనంత సాయం చేస్తున్నారన్న విషయం మాత్రం తెలంగాణ రాజకీయవర్గాలకు ఓ క్లారిటీ వచ్చేసినట్లయింది.