రెండు రోజులుగా తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన కొంత మంది నేతలు హడావుడిగా మీడియా ముందుకు వచ్చి తాము పీసీసీ రేసులో ఉన్నామని ప్రకటించారు. ముఖ్యంగా పీసీసీ చీఫ్ పదవి గురించి ఢిల్లీలో ఏ మాత్రం కదలిక కనిపించినా.. ముందుగా… ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెర ముందుకు వస్తున్నారు. ఆ తర్వాత వీహెచ్ వస్తున్నారు. ఈ సారి కూడా.. వీరిద్దరూ తెర ముందుకు వచ్చారు. తమకేం తక్కువ అని .. తమకు పీసీసీ చీఫ్ పోస్టు కావాల్సిందేనని.. మీడియా ముందు డిమాండ్ చేశారు. బయట నుంచి వచ్చిన వారికి వద్దని.. పార్టీలో సుదీర్ఘంగా పని చేసిన వారికే ఇవ్వాలని అంటున్నారు.
వీరి మాటలను బట్టి చూస్తే.. ఏ క్షణమైనా రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్‌గా ప్రకటించబోతున్నారని.. గాంధీభవన్‌లోనే గుసగుసలాడుకుంటున్నారు. ఎందుకంటే.. వీరిద్దరూ.. రేవంత్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బహిరంగంగానే మండి పడుతున్నారు. రేవంత్ ఏవైనా పోరాటాలు చేస్తే.. అవి వ్యక్తిగతమని.. కాంగ్రెస్‌కు సంబంధం లేదని చెబుతూ ఉంటారు. తామే కాంగ్రెస్ కోసం.. పోరాడుతున్నామని .. తమ పోరాటాల్ని గుర్తించి పీసీసీ చీఫ్ ఇవ్వాలని అంటున్నారు. అయితే..నిజానికి వీరికి పీసీసీ చీఫ్ అయ్యేంత రేంజ్ లేదు. కానీ.. వీరి ఉద్దేశం.., రేవంత్ రెడ్డికి ఇస్తే అసంతృప్తి బయటపడుతుందని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లడమేనని.. రాజకీయం తెలిసిన ఏ ఒక్కరికైనా అర్థమైపోతుంది.
పీసీసీ రేసులో చాలా మంది ఉన్నారని.. ఇప్పుడు కొత్తగా అధ్యక్షుడ్ని నియమించడం కన్నా.. ప్రస్తుతం ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డినే కొనసాగించాలనేది.. ప్రధానంగా… జగ్గారెడ్డి.. వీహెచ్‌ల భావన అని కాంగ్రెస్‌లోనే చెప్పుకుంటున్నారు. కానీ.. కొంత మంది యువ నేతలు మాత్రం.. రేవంత్ రెడ్డివైపు మొగ్గు చూపుతున్నారు. రేవంత్ ఒక్కడే్ టీఆర్ఎస్ పై నిఖార్సుగా పోరాడుతున్నారని.. మిగతా వాళ్లంతా.. లోపాయికారీ వ్యవహారాలు నడుపుతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. మరి ఈ తెలంగాణ రాజకీయాల్ని కాంగ్రెస్ హైకమాండ్ ఎలా కవర్ చేస్తుందో..?