అంబేద్కర్ అంటే రాజ్యాంగ రచయిత. దేశంలోని వర్గాలు పూజ్యనీయులుగా చూడాల్సిన వ్యక్తి. కానీ రాను రాను దళిత వర్గాలకు ఆయనను దేవుడిని చేశారు. ఇతర వర్గాల వారు గౌరవించడం సరి కాదని దళితులు మాత్రమే గౌరవించాలన్నట్లుగా చేశారు. ఇప్పుడు ఆయన పేరుతో మనోభావాల రాజకీయాలు చేసి మొత్తం పసలేని రాజకీయాలు చేస్తున్నారు.
ప్రతీ దానికి అంబేద్కర్ పేరు తీసుకు వస్తున్నారని రాజ్యాంగంపై జరిగిన చర్చలు అమిత్ షా కాంగ్రెస్ పై మండిపడ్డారు. అయన కాంగ్రెస్ తీరును ఆక్షేపించారు కానీ.. అంబేద్కర్ కాదు. ఆయన మాటలు విన్న ఎవరికైనా ఇదే స్ఫూరిస్తుంది.కానీ మన రాజకీయం వేరు కదా.. వెంటనే కాంగ్రెస్ నాయకులు మమ్మల్ని కాదు.. అమిత్ షా అంబేద్కర్ ను అవమానించారని రంగంలోకి దిగిపోయారు. రాజకీయం ప్రారంభించారు. అమిత్ షా అంబేద్కర్ ను ఉద్దేశించి ఏమి అన్నారో మాత్రం ఎవరూ చెప్పడంలేదు. కానీ అవమానించేశారని ఆందోళనలు ప్రారంభించారు.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇదే ఎజెండా. అంబేద్కర్ ను అమిత్ షా అవమానించారని చెప్పి విమర్శలు చేయడం. దళిత నేతలతో ఉద్యమాలు చేయించడం. అంతే కానీ ఆయన ఏమన్నారో మాత్రం చెప్పరు. ఇలాంటి రాజకీయాల వల్ల ప్రజలకు కానీ.., దేశానికి కానీ పైసా ఉపయోగడం ఉండదు. ఫలానా వారిని అవమానించారని.. ఫలానా వారి మనోభావాలను దెబ్బతీశారని ప్రచారం చేసి ఓ వర్గాన్ని వారిపై విరుచుకుపడేలా చేయడానికే పనికొస్తుంది.
అయినా అమిత్ షా వంటి నేతకు అంబేద్కర్ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే రాజకీయం ఎలా ఉంటుందో తెలియదా.. తెలిసి కూడా మాట్లాడతారా?. నిజంగా బీజేపీ లేదా అమిత్ షా ఓ విధానం తీసుకుని అంబేద్కర్ పై విమర్శలు చేస్తే అప్పుడు ఆందోళనలు చేసినా ఓ అందం ఉంటుంది..కానీ తాను ఆయనను ఏమీ అనలేదని.. ద్వంద్వార్థాలు, పెడర్థాలు తీసుకుని రాజకీయం చేస్తే ఎలా అని ఆయన ప్రశ్నిస్తూంటే పట్టించుకునేవారు లేరు.