భారతీయ జనతా పార్టీ విభజన రాజకీయాలు.. ఉద్వేగాలు రెచ్చగొట్టే రాజకీయానికి పరాకాష్ట లాంటి ఘటనలు తాజాగా చోటు చేసుకుంటున్నాయి. దక్షిణాది ప్రజల్లో సమస్యలపై స్పందించే లక్షణంఎక్కువ అంటూ… కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ కేరళలో జరిగిన ఓ బహిరంగసభలో వ్యాఖ్యానించారు. ఇది ఉత్తరాదిని అవమానించడమేనంటూ బీజేపీ నేతలు ఆరోపణలు ప్రారంభించారు. ప్రస్తుతం కేరళ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీ… అక్కడ తరచూ పర్యటిస్తున్నారు. మొన్నటి పర్యటనలో… తాను ఉత్తరాదిలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన సమయంలో ఎదుర్కొన్న అనుభవాలను..కేరళలో ఎంపీగా తను అనుభవాలను వివరించారు.
ఇలా పోల్చి చూడటం బీజేపీ నేతలకు మంచి అవకాశంగా మారింది. ఆయన ఉత్తరాదిని అవమానించారంటూ.. విమర్శలు ప్రారంభించారు. హిందీ మీడియా మొత్తం బీజేపీ అనుకూలమే కావడంతో… వారికి అనుకూలంగా చర్చా కార్యక్రమాలు నిర్వహించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై రకరకాలుగా విశ్లేషణలు చేశారు. అయితే అసలు రాహుల్ గాంధీ అన్నదాంట్లో వివాదాస్పదం ఏముందో ఎవరూ చెప్పలేకపోయారు. ఉత్తరాది కన్నా.. దక్షిణాది ప్రజలు సమస్యలపై స్పందించే గుణంఎక్కువ ఆయన ప్రధానంగా చెప్పారు. ఇది ఉత్తరాదిని కించ పర్చడం ఎలా అవుతుందో బీజేపీ నేతలకే తెలియాలి.
రాజకీయాలు.. భావోద్వేగాలు రెచ్చగొట్టడం కోసం.. ఉత్తరాది, దక్షిణాది తేడాలు చూపించడానికి భారతీయ జనతా పార్టీ నేతలు ఏ మాత్రం వెనుకాడటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే దక్షిణాదిని నిర్లక్ష్యం చేస్తున్నారన్న అభిప్రాయం ఇక్కడి ప్రజలలో బలపడేలా.. కేంద్రం పాలన ఉంది. కీలకమైన ప్రాజెక్టులేవీ..దక్షిణాదికి దక్కడం లేదు.. కానీ పన్నుల్లో వాటాలు మాత్రం అత్యధికం దక్షిణాది నుంచే వెళ్తున్నాయి. అందుకే.. బీజేపీ రాజకీయం చేస్తున్న తీరు ప్రమాదకరం అన్న సంకేతాలు వెళ్తున్నాయి.