తెలంగాణలో రాజకీయాలు ఇప్పుడు వరద సాయం చుట్టూ తిరుగుతున్నాయి. కేంద్ర , రాష్ట్ర అధికార పార్టీల మధ్య పోరు సాగుతూండటంతో ఎవరి లోపాలు వారు బయట పెట్టుకుంటున్నారు. తాజాగా తెలంగాణపై బీజేపీ ఎంత వివక్ష ప్రదర్శిస్తుందో మీరే చూడాలంటూ.. జాతీయ విపత్తు సహాయ నిధులను ఎలా కేటాయించారో ఓ పత్రాన్ని టీఆర్ఎస్ విడుదల చేసింది. అందులో ఐదేళ్లుగా తెలంగాణకు పైసా కూడా ఇవ్వనట్లుగా ఉంది. ఈ పత్రంతో టీఆర్ఎస్ నేతలు .. బీజేపీని కార్నర్ చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు సహాయనిధి ఎన్డీఆర్ఎఫ్ ఖాతా కింద .. విపత్తుల్ని ఎదుర్కొన్న రాష్ట్రాలకు సాయం చేస్తూ ఉంటుంది. ఐదేళ్లుగా చత్తీస్ గఢ్, గోవా, జమ్మూకశ్మీర్, మిజోరం, పంజాబ్, తెలంగాణ , ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు. అయితే ఆయా రాష్ట్రాల్లో విపత్తులేమీ రాలేదా అంటే మిగతా రాష్ట్రాల సంగతేమో కానీ.. తెలంగాణలో మాత్రం ప్రతీ ఏడాది విపత్తులు వస్తున్నాయని టీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు.
2020లో హైదరాబాద్లో వరదలు వచ్చి భారీగా నష్టం జరిగింది. గ్రేటర్ ఎన్నికలకు ముందు వచ్చిన ఈ వరదల్లో హైదరాబాద్కు పెద్ద ఎత్తున సాయం కేంద్రం నుంచి తీసుకు వస్తామని బీజేపీ నేతలు ప్రకటించారు. బీజేపీ జాతీయ నేతలు కూడా వచ్చారు. బండి పోతే బండి ఇస్తామని బండి సంజయ్ చేసిన ప్రకటన వైరల్ అయింది. అయితే ఇంత వరకూ హైదరాబాద్ వరదలకు సంబదించి ఎలాంటి కేంద్రం నుంచి రాలేదు. టీఆర్ఎస్ బయట పెట్టిన ఎన్డీఆర్ఎఫ్ లెక్కలపై బీజేపీ ఇంకా స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం గోదావరి వరద బాధితులకు కేంద్ర సాయం విషయంలో బీజేపీ ఒత్తిడి ఎదుర్కొంటోంది.