దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సిర్పూర్ కాగజ్ నగర్లో అటవీ అధికారిపై దాడి వ్యవహారంలో పోలీసులు కొత్త ట్విస్ట్ ఇచ్చారు. దాడికి గురైన అటవీ అధికారిపై నేరుగా అట్రాసిటీ కేసు పెట్టారు. దీంతో.. మరో సారి.. ఈ విషయం హైలెట్ అయింది. ఎఫ్ఆర్ఓ అనితతో పాటు మరో పదిహేను మంది ఫారెస్ట్ అధికారులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కులం పేరుతో దూషించి.. గిరిజనుల పై దాడి చేశారని ఓ మహిళ ఫిర్యాదు చేయగానే.. కేసు పెట్టేశారు. పది రోజుల కిందట సార్సాలలో అటవీ అధికారులు మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యారు. అడ్డుకున్నందుకుగాను అనితతోపాటు అటవీసిబ్బందిపై కర్రలు, రాళ్లతో గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో ఎమ్మెల్యే కోనేరు సోదరుడు కృష్ణారావుతో పాటు 15 మందిపై కేసు కూడా నమోదు చేశారు.
అటవీ అధికారులపై దాడి ఘటన ఘటన పార్లమెంట్లోనూ ప్రస్తావనకు వచ్చింది. కేంద్రమంత్రులు కూడా తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలను సహించబోమని ప్రకటించారు. సొంత పార్టీకి చెందిన నేత కావడంతో.. టీఆర్ఎస్.. ఈ వివాదం నుంచి.. వారిని బయట పడేసేందుకు ప్రయత్నాలు చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ అటవీ అధికారిక అనిత… ఆ తర్వాత కూడా.. తన ప్రాణానికి ముప్పు ఉందని.. సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే గతంలోనూ ఇలాగే వ్యవహరించారని చెబుతూ.. ఆయనపై కచ్చితంగా చర్యలు తీసుకోవలాని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో.. ఇప్పుడు ఆమెపైనే నేరుగా.. ఎస్సీ, ఎస్టీ కేనును నమోదు చేశారు.
అటవీ అధికారులు. విధుల నిర్వహణ కోసమే అక్కడికి వెళ్లారు. ఇలా కేసులు పెడితే.. ఇక తాము.. ఎలా అడవుల్ని కాపాడగలమని.. అటవీ అధికారులు.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలు ఇప్పటికే నోరెత్తలేని పరిస్థితికి వెళ్లాయి. అనితపై దాడి జరిగిన తర్వాత.. ఏ ఉద్యోగ సంఘమూ కూడా… పెద్దగా స్పందించిన దాఖలాల్లేవు. ఈ కారణంగానే… ఎస్సీ, ఎస్టీకేసు పెట్టగలిగారని అంటున్నారు. మొత్తానికి తెలంగాణ ఉద్యమంలో.. ఉద్యోగులందర్నీ ఏకతాటిపైకి తెచ్చిన సంఘాలు.. ఇప్పుడు… తమకు అన్యాయం జరుగుతున్నా.. పట్టించుకోలేకపోతున్నాయి. దానికి సాక్ష్యం.. ఎఫ్ఆర్వో అనిత కేసే..!