శ్రీరెడ్డి అనే నటీమణితో తిట్టించి… పదే పదే టీవీల్లో ప్రసారం చేసి..తనను రాజకీయ అత్యాచారం చేస్తున్నారని కొన్ని రోజుల కిందట పవన్ కల్యాణ్ తన ఆవేదనను ట్వీట్ రూపంలో వ్యక్తం చేశారు. ఆయన ఓ రాజకీయ పార్టీ నేత. ఆయనను వేరే పార్టీ వాళ్లు కానీ.. మీడియా కానీ విమర్శించడం అత్యంత సహజం. ఆయన కూడా ఇతర పార్టీల నేతల్ని అలాగే విమర్శిస్తూంటారు. దానికి రాజకీయ అత్యాచారం లాంటి పెద్ద మాట అనాల్సిన అవసరం లేదు… కానీ ఈ రాజీకయ నాయకులందరూ కలిసి.. దాచేపల్లిలో సుబ్బయ్య అనే దుష్టుడి దాష్టికానికి బలైపోయిన పాప విషయంలో వ్యవహరించిన తీరు మాత్రం కచ్చితంగా రాజకీయ అత్యాచారమే. రాజకీయాలకు సంబంధం లేదని.. మెదడులో క్రూరత్వం..కీచకం నింపుకున్న వృద్ధుడు చేసిన ఘాతుకం అది. దాన్ని అడ్డుపెట్టుకుని ఓట్ల వేట సాగించాయి రాజకీయ పార్టీలు. సుబ్బయ్య మీ పార్టీ వాడంటే.. మీ పార్టీ వాడని.. పరస్పరం ఆధారాలు విడుదల చేసుకున్నారు. మీ పార్టీలోనే రేపిస్టులున్నారని ఒకరంటే.. మీ పార్టీలోనే ఉన్నారంటూ.. మరొకరు.. ఎదురు దాడి చేసుకున్నారు. ఈ వ్యవహారాలన్నీ రోజంతా టీవీల్లో పెద్ద ఎత్తన ప్రహనంలా నడిచాయి.
అన్నెంపున్నెం తెలియని పాపను చెరబట్టిన కిచకుడికి వేశారో.. విధించారో కానీ శిక్ష పడింది. అమలులోకి వచ్చిన కొత్త చట్టం ప్రకారం.. ఆ శిక్ష ఆ వృద్ధుడికి పడేదే. కానీ… భారతీయ న్యాయవస్థలో… న్యాయం జరిగేసరికి దశాబ్దాలు పడుతుంది. అంత కాలం.. ఆ పాప తనపై జరిగిన దాష్టీకాన్ని రోజు గూర్తు చేసుకోవాల్సిందేనా..? కోర్టులో విడమర్చి చెప్పాల్సిందేనా..? జరిగిందేదో జరిగిపోయింది.. సుబ్బయ్య మరణాన్ని కూడా ఓట్ల వేటకు ఉపయోగించుకుంటున్నాయి పార్టీలు. అధికార పార్టీ.. బహిరంగంగా చెప్పకపోయినా… సుబ్బయ్య ఉరి తమ క్రెడిట్ అని ప్రచారం చేసుకునేందుకు ఏ మాత్రం సంకోచించడం లేదు. అదే సమయంలో.. టీడీపీకి కౌంటర్‌గా … సుబ్బయ్యను అన్యాయంగా ఉరి తీశారనే ప్రచారాన్ని వైసీపీ నేతలు ప్రారంభించారు.
బాధితురాలికి అండగా ఉండే విషయంలోనూ… ప్రధాన పార్టీలు చేసిన రాజకీయం సామాన్య ప్రజలకు అసహ్యం కలిగించింది. గుంటూరు ప్రభుత్వాసుపత్రి ముందు… విపక్ష పార్టీలు చేసిన మైలేజీ డ్రామా…రాజకీయాలంటే.. ఇంత అసహ్యంగా ఉంటాయా అనిపించేలా చేశాయి. రాజకీయాల కోసం.. ఇంత హడావుడి చేస్తూంటే.. పాప కుటుంబసభ్యుల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో కనీసం ఊహించడానికి కూడా రాజకీయ నేతలకు మనసు రాలేదు.
దాచేపల్లి పాపను అడ్డం పెట్టుకుని.. రెండు రాజకీయ పార్టీలు ఎంత చేయాలో అంత చేశాయి. ఒకరు ప్రారంభించారు కాబట్టి.. తాము రేసులోకి దిగకబోతే.. నష్టపోతామన్నట్లు.. ఒకరిని చూసి ఒకరు.. బరితెగించారు. దాచేపల్లి పాప విషయంలో అచ్చంగా నేతలు చేసింది మాత్రం రాజకీయ అత్యాచారమే. దీనికి ఎలాంటి శిక్ష వేయాలో ప్రజలే నిర్ణయించాలి.