కర్నూలు, కడప జిల్లాల్లో కొన్ని చేరికలు, చేరికల తర్వాత ఏర్పడిన పరిస్థితులను సర్దుబాటు చేయడానికి చంద్రబాబు… రోజూ.. కొంత సమయం కేటాయిస్తున్నారు. సమయం గడిచిపోతుంది కానీ.. ఆ పంచాయతీలు తేలడం లేదు. ఎప్పుడు సమావేశం పెట్టినా ఇప్పుడు తేల్చేస్తామని చెబుతారు కానీ.. మీరే తేల్చుకోవాలని రావాలని.. అంతిమంగా చంద్రబాబు వారికి చెప్పి పంపిస్తున్నారు. మళ్లీ భేటీలో వారు.. తమ తమ వాదనకే కట్టుబడి ఉంటున్నారు దాంతో ఆ పంచాయతీలు ఎటూ తేలడం లేదు. బుధవారం పొద్దు పోయే వరకూ.. కడప, కర్నూలు జిల్లాల విషయంపై చంద్రబాబు చర్చలు జరిపారు. కానీ కనుచూపు మేరలో పరిష్కారం కనిపించలేదు.
కర్నూలు జిల్లాలో కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కుటుంబం టీడీపీలో రావడం ఖాయమని..మాత్రం కేఈ వర్గానికి చంద్రబాబు స్పష్టమైన సూచన పంపారు. కోట్లతో పని చేయాలని కేఈ కుటుంబసభ్యులకు తేల్చి చెప్పారు. కేఈ కృష్ణమూర్తి.. తన సోదరులు, కుమారుడితో సహా అర్థరాత్రి సమావేశమయ్యారు. కోట్ల రాక విషయంలో తన అభ్యంతరాలు చెప్పుకున్నారు. అయితే కోట్ల కుటుంబం తమకు టిక్కెట్లు కావాలని అడగలేదని… చెప్పిన చంద్రబాబు.. కేఈ కుటుంబానికి కూడా.. అలాంటి హమీ ఏమీ ఇవ్వలేదు. పార్టీని బలోపేతం చేసే క్రమంలో ఎవరు వచ్చినా ఆహ్వానించాలని, కోట్ల కుటుంబంతో కలసి పనిచేయాలని కేఈ సోదరులకు ముఖ్యమంత్రి సూచించినట్లు తెలుస్తోంది. దానికి కేఈ కలసి పని చేస్తామని బదులిచ్చారు.
కేఈ కృష్ణమూర్తి ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకోవాలనుకుంటున్నారు. ఆయన కుమారుడికి పత్తికొండ టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఆయన సోదరుడు ప్రతాప్ గత ఎన్నికల్లో డోన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి ఆయనకే టిక్కెట్ ఇవ్వాలని కేఈ కోరుతున్నారు. మరో సోదరుడు.. కేఈ ప్రభాకర్.. ఎమ్మెల్సీగాఉన్నారు. ఈ పంచాయతీ అలా ముగిసింది.
ఆ తర్వాత తెల్లవారు జాము వరకు… కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ టికెట్ పంచాయతీ నడిచింది. ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డితో ముఖ్యమంత్రి విడివిడిగా మాట్లాడారు. వారిద్దరిలో ఒకర్ని కడప లోక్‌సభ స్థానం నుంచి, మరొకర్ని జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు ఇప్పటికే నిర్ణయించారు. కానీ చంద్రబాబు ఎటూ తేల్చలేదు. ఓ ఫార్ములా రెడీ చేసి.. ఇద్దరి మధ్య సయోధ్య కోసం.. సీఎం రమేష్ ప్రయత్నిస్తున్నారు. రామసుబ్బారెడ్డికి జమ్మలమడుగు అసెంబ్లీ టికెట్, ఆదినారాయణ రెడ్డికి కడప లోక్‌సభ టికెట్ ఖరారయ్యే అవకాశమున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ.. దానికి ఆది నారాయణరెడ్డి అంగీకరించడం కష్టమేనని చెబుతున్నారు.