తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతల తప్పిదాలు ప్రజల పట్ల ప్రాణసంకటంగా మారాయి. ఓ వైపు రాజకీయ నేతలు కరోనాకు తాము అతీతమన్నట్లుగా ర్యాలీలు.. రాజకీయ కార్యక్రమాలు నిర్వహించి కరోనా వ్యాప్తికి కారణం అయితే.. మరికొంత మంది నేతలు.. తమ మద్దతుదార్లను చికిత్సకు పంపకుండా అడ్డుకుని దారుణమైన తప్పిదం చేశారు. ఆ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి.
నేతల నిర్లక్ష్యంతోనే ప్రజలకు అంటుకుంటున్న వైరస్..!
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఒక్కరోజే 24 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అందులో పది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. కాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి లాక్ డౌన్ ను.. రాజకీయ ప్రచార సమయంగా మొదటి నుంచి భావించారు. అధికారుల్ని ఇష్టం వచ్చినట్లుగా.. సహాయ కార్యక్రమాలతో తిప్పారు. ఓ సారి రెండు వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. పేదలకు నిత్యావసర వస్తువుల పేరుతో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. అప్పటికే కాళహస్తిలో రెండే పాజిటివ్ కేసులున్నాయి. ఇప్పుడు అవి 34కి చేరుకున్నాయి. గుంటూరు జిల్లా నర్సరావుపేటలోనూ అదే పరిస్థితి. ఒక్క రోజే నర్సరావుపేటలో ఇరవై పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నర్సరావుపేటలో కరోనా కేసు బయటపడక ముందే మొదటి మరణం చోటు చేసుకుంది. మరణించిన తర్వాత కరోనా గుర్తించారు. ఆ తర్వాత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అధికారులు నేతల ఒత్తిడికి తలొగ్గి.. కాంటాక్ట్‌లను గుర్తించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించారు. దాంతో ఒక్క రోజే ఇరవై కేసులు నమోదయ్యాయి.
నేతల ప్రచార దాహానికి సామాన్యుల ప్రాణాలు బలి..!
ఏపీలో పలు చోట్ల కేసులు భారీగా పెరగడానికి ప్రజా ప్రతినిధుల నిర్వాకమే.. కారణం. మర్కజ్‌కు వెళ్లిన వచ్చిన వారిని క్వారంటైన్‌కు తరలించే విషయంలో.. అధికారలపై ప్రజా ప్రతినిధులు ఒత్తిడి తెచ్చారు. చివరికి వైరస్ లక్షణాలు బయటపడిన తర్వాత కూడా వారిని క్వారంటైన్ కు తరలించడానికి అడ్డుపడ్డారు. ఇలా దాచి పెట్టడం వల్ల తెలంగాణలని నిజామాబాద్‌లో కరోనా కేసులు పెరిగాయి. ఇక గుంటూరులో అయితే.. అధికార పార్టీ ఎమ్మెల్యే కుటుంబం కారణంగా పెద్ద ఎత్తున వైరస్ వ్యాప్తి అయింది. పరిస్థితి ఇంత సీరియస్‌గా ఉన్న ఐసోలేషన్ లో ఉన్న వారిని తీసుకెళ్లేందుకు కూడా ఆ ఎమ్మెల్యే ప్రయత్నించారు. మరో ప్రజాప్రతినిధి.. తమకు ఆప్తులైన వారికి వైరస్ వస్తే.. ప్రభుత్వాసుపత్రికి తరలించకుండా వాళ్ల ఇంట్లోనే ఉంచి చికిత్స చేయాలని హుకుం జారీ చేశారు. కర్నూలులో ఓ ప్రముఖ డాక్టర్ మరణానికి కూడా ఇలాంటి నిర్లక్ష్యమే కారణం. రెడ్ జోన్ లో ఉన్న ఆస్పత్రిని సాదారణ రోగుల కోసం తెరిచి ఉంచేలా.. ఓ ఎమ్మెల్యే తన పలుకుబడిని ఉపయోగించారు. ఇప్పుడు కర్నూలులో ఏపీలోనే అత్యధిక సంఖ్యలో వైరస్ పాజిటివ్ కేసులున్నాయి.
చట్టాలు..నిబంధనలు అధికార చుట్టాలయితే ఇదే పరిస్థితి..!
ఏపీలో స్థానిక ఎన్నికలు మధ్యలో ఉండటంతో లాక్ డౌన్ కాలాన్ని వైసీపీ నేతలు ప్రచార సమయంగా ఉపయోగించుకుంటున్నారు. కరోనాకు తాము అతీతం అన్నట్లుగా.. గుంపులు..గుంపులుగా తిరుగుతున్నారు. ఏకగ్రీవం అయిన చోట్ల ఏ వైసీపీ నేత కనిపించడం లేదు కానీ..ఎన్నికలు ఉన్న చోట మాత్రం.. పెద్ద ఎత్తున పేదలకు సాయం పేరుతో రోజువారీ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎక్కడా సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదు. లాక్ డౌన్ నిబంధనలు అసలు గుర్తుకే తెచ్చుకోవడం లేదు. బ్లడ్ డొనేషన్ నిషేధిస్తూ ఓ వైపు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా.. అట్టహాసంగా.. అలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉన్నారు. పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి వస్తున్నారు. కొంత మందిని ఆయా రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నారు. వీరు ఇలా చేయడం వల్ల ఎంత ముప్పు ఏర్పడుతుందో.. ముందు ముందు బయటపడుతుంది. వైరస్‌కు… రాజకీయ పార్టీలు తెలియవు. ఆ విషయం అధికార పార్టీల నేతలు గుర్తించలేకపోతున్నారు. ఫలితంగా ఏపీ ప్రజలు డేంజర్లో పడిపోయారు.