ఫిబ్రవరి 23వ తేదీన సివిల్ డ్రెస్‌లో ఉన్న తెలంగాణ పోలీసులు… తెలుగుదేశం పార్టీ యాప్.. సేవామిత్రను నిర్వహిస్తున్న సంస్థపై దాడి చేశారు. సోదాలు చేశారు. దొరికిన డేటా పట్టుకెళ్లారు. అప్పటికి కేసేంటో.. ఎవరికీ తెలియదు. కానీ ఆ తర్వాత హఠాత్తుగా.. రెండో తేదీ అర్థరాత్రి కేసు నమోదు చేసి.. అధికారికంగా సర్వర్లు, సీపీయూలు, ట్యాప్‌లు, ల్యాప్‌ట్యాప్‌లు పట్టుకెళ్లారు. ఆ తర్వాత ఐటీ గ్రిడ్ వద్ద.. ఏపీ ప్రభుత్వానికి చెందిన ప్రజల సమాచారం ఉందంటూ.. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ నేరుగా ప్రకటించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ .. సేవా మిత్ర యాప్ ఎలా పని చేస్తుందో వివరించారు. అందులో ప్రజల నుంచి వ్యక్తిగత వివరాలు తీసుకున్నారని చెప్పుకొచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో.. తెలుగుదేశం పార్టీ యాప్ .. సేవామిత్రనే కీలకం. అంతిమంగా దాని ద్వారా ఓట్లు తీసేస్తున్నారని నిరూపించాలనుకుంటున్నారు.
ఎన్నికల సమయంలో కేటీఆర్ చేసింది అదే కదా..!?
తెలుగుదేశం పార్టీ.. తన ఎన్నికల వ్యూహాన్ని ఆ యాప్ ద్వారానే అమలు చేస్తోంది. ఈ లోపు యాప్‌ను టార్గెట్ చేశారు. మొత్తానికి అందులో ఉన్న మ్యాటర్ అంతా తీసుకున్నారు. అందులో… టీడీపీ కార్యకర్తల సమాచారం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పోలీసులు ప్రజల వ్యక్తిగత సమాచారం అంటున్నారు. ఇలాంటి సేవామిత్ర యాప్.. ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉందా.. అంటే.. దేశంలో ఉన్న రాజకీయ పార్టీలందరికీ ఉన్నాయి. సాంకేతికంగా.. ముందు చూపుతో ఉన్న జాతీయ, ప్రాంతీయపార్టీల నేతలందరికీ ఉన్నాయి. చివరికి టీఆర్ఎస్ కు కూడా ఉంది. టీడీపీ యాప్ ను పోలీసులు టార్గెట్ చేసిన గంటల వ్యవధిలోనే… టీఆర్ఎస్ మిషన్ యాప్ కు సంబంధించిన సమస్త సమాచారం బయటకు వచ్చింది. టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం నుంచి తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారం అప్ లోడ్ చేసి.. యాబై దేశాల్లో ఉన్న ప్రవాస తెలంగాణ పౌరులకు .. ఆ డేటాను ఇచ్చి… ఫోన్లు చేసి.. ఓట్లు అడిగే బాధ్యతను ఇచ్చారు. దీనికి సంబంధించిన సాంకేతిక వివరాలతో సహా మొత్తం బయటకు వచ్చాయి. టీడీపీ చేసింది తప్పు అని తీర్పు చెప్పిన కేటీఆర్ ఈ యాప్ కు కర్త, కర్మ,క్రియ అని..టీఆర్ఎస్ వర్గాలు చెబుతాయి.
టీఆర్ఎస్ యాప్‌ను ఎందుకు ప్లేస్టోర్ నుంచి తీసేశారు..?
ఇప్పుడు ఆ యాప్‌ను అసలు ప్లే స్టోర్ నుంచి తొలగించేశారు. ఆ యాప్ ను ఎవరు పెట్టారో.. ఎవరు తీసేశారో తమకు తెలియదని.. ఆ యాప్ తో తమకు సంబంధం లేదని… ప్రకటించేశారు. బహుశా.. తమ యాప్ పై పొరుగు రాష్ట్రంలోనూ ఇలాంటి కేసు పెడతారని.. టీఆర్ఎస్ ఊహించి ఉంటుందన్న అభిప్రాయం ఏర్పడింది. అయితే.. పెట్టాలని అనుకుంటే.. దానికి సంబంధించిన టెక్నికాలిటీస్ తీసుకుని.. అందులో ఉన్న డాటా మొత్తాన్ని బయటకు తీయడం పెద్ద పని కాదని.. యాప్ లు రూపొందించేవారికి తెలుసు. కానీ.. తాము తప్పని కేసు పెట్టించిన పనిని… మూడు నెలల కిందటే ఘనంగా చేశామని.. చెప్పుకోలేక.. టీఆర్ఎస్ దాన్ని డిలీట్ చేసింది. బీజేపీ వెబ్ సైట్‌ను డౌన్ చేశారు.
కార్యకర్తల సమాచారం ఇతర పార్టీల వద్ద ఉండదా..?
ఈ డేటా ఫార్ములా ఇప్పటిది కాదు. ఎప్పటి నుంచో ఈ డేటా థియరీని పార్టీలు అనుసరిస్తున్నాయి. లబ్దిదారుల వివరాలు పబ్లిక్ డొమైన్లోఉంటాయి. గ్రామాల్లో అయితే.. గోడల మీద రాస్తారు కూడా. కాబట్టి… ప్రభుత్వ లబ్దిదారుల సమాచారం అనేది.. వ్యక్తిగత వివరం కిందకు రాదు. కాంగ్రెస్ పార్టీ, వైసీపీ దగ్గర కూడా.. ఇవి ఉంటాయి. వైసీపీ దగ్గర వైఎస్ హయాంలో… పావలా ప్రయోజనం పొందిన వారి వివరం కూడా ఉంది. అది ఒక్కటే కాదు.. వైసీపీ దగ్గర తాజాగా.. టీడీపీకి చెందిన ప్రతీ కార్యకర్త వివరం ఉంది. జగన్ పేరుతో వారి అడ్రస్‌కు నేరుగా లేఖలు వస్తున్నాయి. ఆ తర్వాత కాల్స్ కూడా వస్తాయి. ఇలాంటి డేటా ఏ పార్టీ అయినా మెయిన్ టెయిన్ చేస్తూనే ఉంటుంది. కానీ సేవామిత్రను మాత్రమే టార్గెట్ చేశారు. ఇది టీడీపీని టార్గెట్ చేసి చేస్తున్న దాడిగా నిర్ధారించుకోవడానికి ఇంత కన్నా… వేరే సాక్ష్యం అక్కర్లేదనుకుంటా..!