ఆంధ్రక్రికెట్ అసోసియేషన్‌్ మొత్తం విజయసాయిరెడ్డి కబ్జా చేయడం ఇప్పుడు సంచలనం అవుతోంది. సాధారణంగా క్రికెట్ సంఘాల్లో గట్టి పోటీ ఉంటుంది. రెండు వర్గాలుంటాయి. ఒకరినొకరు కేసులు పెట్టుకునే వరకూ పరిస్థితి ఉంటుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌నే తీసుకుంటే.. అక్కడ జరిగే రచ్చ అంతా ఇంతా కాదు. ప్రభుత్వం అధికార బలం ప్రయోగించినా… చాలా మంది లొంగరు. కానీ ఏపీలో మాత్రం అలా పరిస్థితి లేదు. వెంటనే లొంగిపోయారు. అసోసియేషన్ నుంచే వెళ్లిపోవడమో..లేకపోతే.. సైలెంట్‌గా ఉండటమో చేస్తున్నారు.
ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ అంటే.. గతంలో గోకరాజు గంగరాజు. ప్రముఖ పారిశ్రామికవేత్త, బీజేపీ మాజీ ఎంపీ, కేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలు.. అంతకు మించి ఆరెస్సెస్‌కు మహారాజ పోషకుడి లాంటి వ్యక్తి. ఆయనకు ఏసీఏలో తిరుగులేని స్థానం ఉండేది. ఆయన కుటుంబం వైసీపీలో చేరింది. తర్వాత ఏసీఏలో ఆయన వేలు పెట్టడం లేదు. నర్సాపురం నుంచి వైసీపీ తరపున ఆయన కుటుంబసభ్యుడికే టిక్కెట్ ఖరారాయిందని చెబుతారు. గతంలో చాముండేశ్వరి నాథ్ , ఎమ్మెస్కె ప్రసాద్ వంటి క్రికెటర్లు ఏసీఏ కార్యకలాపాల్లో ఉండేవారు. ఇప్పుడు వారి ఊసే లేదు. వారందర్నీ ఎలా సైలెంట్ చేశారన్నది చర్చనీయాంశంగా మారింది.
ఒకరిద్దరంటే సరే కానీ.. అందరూ సైలెంట్ అయిపోయారు. అన్ని పదవుల్లోనూ విజయసాయిరెడ్డి బంధువులు.. వ్యాపార భాగస్వాములే ఎన్నికవుతున్నారు. పోటీ పడాలనుకునేవారు లేకుండా ఉండరు. వారిని.. తప్పించారని స్పష్టంగా తెలుస్తోంది. ఏం చెప్పి తప్పించారు..? ప్రభుత్వంలో పదవులు ఆశ చూపి తప్పించారా లేకపోతే.. పోటీ పడితే ఆస్తులపై ఆశలు వదులు కోవాల్సి వస్తుందని హెచ్చరించారా అన్నది సీక్రెట్‌గా మారింది. మొత్తంగా ఏసీఏని విజయసాయి కబ్జా చేసిన తీరు.. విశాఖలో స్థలాలను రాసేసుకుంటున్న తీరునే తలపిస్తోందని ్ంటున్నారు.