వరంగల్ లోక్ సభ నియోజక వర్గంలో ఈరోజు ఉదయం ఏడు గంటల నుండి పోలింగ్ మొదలయింది. అన్ని పోలింగ్ స్టేషన్లలో మొట్ట మొదట ఓటు వేసిన ఓటర్లకు ఎన్నికల అధికారులు పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతించడం విశేషం. ఒకే ఒక్క లోక్ సభ స్థానానికి మొత్తం 23 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. కానీ పోటీ ప్రధానంగా మూడు ప్రధాన పార్టీల మధ్యనే ఉండబోతోందని స్పష్టం అయింది. వాటిలో ఏ పార్టీని వరంగల్ ప్రజలు గెలిపిస్తారో మరో నాలుగు రోజుల్లో అంటే నవంబర్ 24వ తేదీన ఫలితాలు వెల్లడయినప్పుడు తెలుస్తుంది. వరంగల్ లోక్ సభ నియోజక వర్గ పరిధిలో మొత్తం 15, 09,671 మంది ఓటర్లు ఉన్నారు. వారి కోసం మొత్తం 1, 778 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. మొత్తం 9, 425 మంది ఎన్నికల సిబ్బంది ఈ పోలింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. సుమారు 10, 000 మంది పోలీసులను మొహరించారు. సాయంత్రం 5గంటలకి పోలింగ్ ముగుస్తుంది.