తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని నెలల క్రితం జరిగిన ఎన్నికలకు ఏ మాత్రం తీసిపోని విధంగా చెన్నైలోదక్షిణభారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) ఎన్నికలు జరుగుతున్నాయి. గత పదేళ్ళుగా నడిగర్ సంఘానికి తమిళ సినీ నటుడు శరత్ కుమార్ బృందమే నేతృత్వం వహిస్తోంది. ఈసారి వారితో నటుడు విశాల్ బృందం పోటీ పడుతుండటంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఇవ్వాళ్ళ ఉదయం చెన్నైలోని ఆళ్వార్ పేటలోని ఒక ప్రైవేట్ స్కూల్లో నడిగర్ సంఘానికి పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 8.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే తమిళ సినీ పరిశ్రమకి చెందిన అనేకమంది నటీ నటులు వచ్చి తమ ఓట్లు వేసి వెళ్ళారు.
ఇంతవరకు శరత్ కుమార్, విశాల్ బృందాల సభ్యుల మధ్య తీవ్ర విమర్శలు, వాదోపవాదాలు కొనసాగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్తితుల మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. తమ అభిమాన సినీ నటులు అందరూ అక్కడికి వస్తుండటంతో వారిని చూడటానికి వారి అభిమానులు భారీగా తరలివస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మొహరించారు. పోలింగ్ ముగుసిన వెంటనే ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ఎన్నికలలో సీనియర్ నటీ నటులు అందరూ శరత్ కుమార్ బృందానికి, జూనియర్ నటీ నటులు అందరూ విశాల్ ప్యానల్ కి మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో ఎవరి ప్యానల్ గెలుస్తుందనే విషయం ఇవ్వాళ్ళ సాయంత్రం ఆరు-ఏడు గంటలకల్లా తెలిపోవచ్చును. ఎవరు గెలిచినా ఇచ్చిన హామీలను అమలుచేయలేకపోతే రాజీనామా చేయడం మంచిదని ప్రముఖ నటుడు రజనీ కాంత్ అన్నారు.