నేడు ఖమ్మం జిల్లా పాలేరు ఉపఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ ఎన్నికలలో పోటీ ప్రధానంగా కాంగ్రెస్, తెరాసల మద్యనేనని స్పష్టం అయ్యింది. వాటిలో తెరాస విజయం సాధించడం ఖాయం అనే అందరూ భావిస్తున్నప్పటికీ, టీ-కాంగ్రెస్ నేతలు ఉదృతంగా చేసిన ప్రచారం వలన తెరాసకు మెజారిటీ చాలా తగ్గే అవకాశాలున్నాయి. ఒకవేళ ఈ ఉపఎన్నికలలో తెరాసకు మెజారిటీ తగ్గినా లేదా కాంగ్రెస్ గెలిచినా అది తెరాసకు మొదటి ఎదురుదెబ్బ అవుతుంది.
తెరాస అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తన అనుచరుడినో లేదా పార్టీ సూచించిన అభ్యర్దినో బరిలో దించి, అతను లేదా ఆమెను గెలిపించుకొని ఉంటే అది ఆయన సత్తా చాటుకొన్నట్లుండేది. కానీ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మంత్రిగా పనిచేస్తున్న ఆయనే స్వయంగా అభ్యర్ధిగా బరిలోకి దిగడం, ఆయన తరపున ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రచారం చేయడం ఆయన స్థాయిని దిగజార్చినట్లయింది. ఒకవేళ ఆయన బారీ మెజారిటీ సాధిస్తే ఆ క్రెడిట్ అది కేటీఆర్ పద్దులో జమా అవుతుంది తప్ప ఆయన సమర్ధతకి అద్దం పట్టదు. ఒకవేళ బొటాబొటి మెజార్టీతో గెలిచినా, కాంగ్రెస్ చేతిలో ఓడిపోయినా ఆ అప్రదిష్ట తుమ్మల ఖాతాలోనే వ్రాయబడుతుంది. ఆయన ఓడిపోతే అది తెరాస పార్టీకి, ముఖ్యమంత్రి కేసీఆర్ కి కూడా చాలా అప్రదిష్ట అవుతుంది.
జిల్లాలో మంచి పేరు ప్రతిష్టలున్న కాంగ్రెస్ నేత ఎమ్మెల్యే రామిరెడ్డి వెంకట రెడ్డి మృతి కారణంగా జరుగుతున్న ఈ ఉపఎన్నికలలో ప్రజల సానుభూతి ఓట్లతో తప్పకుండా విజయం సాధించగలమని కాంగ్రెస్ నేతలు దృడంగ నమ్ముతున్నారు. ఆ నమ్మకంతోనే వారు చాలా గట్టిగా ప్రచారం చేసారు. ఒకవేళ ఈ ఉపఎన్నికలలో గెలిస్తే, రాష్ట్రంలో తెరాసకు కాంగ్రెస్ పార్టీయే ఏకైక ప్రత్యామ్నాయం అని రుజువు అవుతుంది. ఒకవేళ ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీ కొత్తగా నష్టపోయేదేమీ ఉండదు. దాని ఖాతాలో మరో అపజయం వ్రాసుకొంటుంది. అంతే! మరి ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తారో? తెలియాలంటే శుక్రవారం వరకు వేచి చూడాల్సిందే.