నాగార్జునసాగర్, తిరుపతి లలో ఉప ఎన్నికల అంకం ముగిసింది. అయితే ఉప ఎన్నికల అనంతరం అందుతున్న సమాచారం మేరకు, గతంతో పోలిస్తే, నాగార్జునసాగర్ లో పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగితే, తిరుపతి లోక్ సభ స్థానానికి మాత్రం పోలింగ్ శాతం గతంతో పోలిస్తే భారీగా తగ్గింది. వివరాల్లోకి వెళితే..
నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలలో ఇవాళ 88% ఓటింగ్ నమోదైంది. 2018 ఎన్నికల్లో ఇదే స్థానానికి నమోదైన 86.8% తో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం స్వల్పంగా పెరిగినట్టు. అయితే తిరుపతి ఉప ఎన్నిక లో, కేవలం 64.29 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. అందులోనూ తిరుపతి పట్టణంలో కేవలం 50.5% మాత్రమే ఓటింగ్ నమోదైంది. 2019 లోక్ సభ ఎన్నికలలో తిరుపతి స్థానానికి 79% ఓటు నమోదు కావడం గమనార్హం.
సాధారణంగా ఓటింగ్ శాతం పెరగడం ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉంటుందని, తక్కువ ఓటింగ్ శాతం అధికార పక్షానికి అనుకూలంగా ఉంటుందని ఒక విశ్లేషణ ఉన్నప్పటికీ, అది అన్ని సార్లు నిజం అయ్యే అవకాశం లేదు. పైగా తిరుపతి ప్రాంతంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉండటం, ఓటింగ్ శాతం పెరగడానికి ఒక కారణం అని చెబుతుండగా, ఉదయం నుండి తిరుపతి లో దొంగ ఓట్ల వ్యవహారం కారణంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడం మరొక కారణం అని ఇంకొందరు చెబుతున్నారు.
ఏది ఏమైనా ఈ ఓట్ల శాతం ఎవరికి అనుకూలం అనేది మే 2న తెలుస్తుంది.