ఉదయం ఏడు గంటలకు మొదలవ్వాల్సిన పోలింగ్… చాలాచోట్ల మూడు, నాలుగు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటలకు ముగించాల్సిన ఓటింగ్ ప్రక్రియ… అర్ధరాత్రి వరకూ కొనసాగింది. సాయంత్రం ఆరు వరకూ 6 వేల కేంద్రాలో పోలింగ్ జరిగింది. రాత్రి 9: 15 వరకూ 700 పైచిలుకు కేంద్రంలో పోలింగ్ జరిగింది. పది వరకూ 250, రాత్రి 11 దాటేవరకూ 109 చోట్ల, అర్థరాత్రి దాటాక కూడా 23 చోట్ల పోలింగ్ జరిగింది.
సజావుగా సాగాల్సిన ఎన్నికల ప్రక్రియ.. ఇలా గంటలకొద్దీ, రోజుల కొద్దీ ఎందుకు కొనసాగింది? కచ్చితంగా నిర్వహణ లోపమే. ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ఎన్నికల ప్రక్రియకు సిద్ధమౌతున్నప్పుడు… పనిచెయ్యని ఈవీఎంలు ఇంత పెద్ద సంఖ్యలో ఎందుకు ఉంటాయి? ముందుగా, వాటిని సరి చూసుకోరా, ఎన్నికల సంఘం బాధ్యత అదే కదా? పనిచెయ్యని ఈవీఎంలను వెంటనే మార్చాలి. కానీ, దానికీ గంటలు పట్టింది. మంగళగిరిలో 70కి పైగా ఈవీఎంలు మొరాయించాయి. వీవీప్యాట్లు సరిగా రాకపోవడంతో దాదాపు నాలుగు గంటలు పోలింగ్ నిలిచిపోయిన పరిస్థితి. క్రిష్ణా జిల్లాలో దాదాపు 400 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు సరిగా పనిచెయ్యలేదు. 11 గంటల తరువాతే పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ప్రకాశం జిల్లాలో 350 కేంద్రాల్లో ఇదే పరిస్థితి. కడపలో 300 కేంద్రాలు, శ్రీకాకుళం జిల్లాలో 150 కేంద్రాలు, విశాఖలో 250కి పైగా పోలింగ్ కేంద్రాలు… ఇలా జిల్లాలవారీగా వందకు తక్కువ నంబర్ లేనే లేదు.
ఈవీఎంలు ఇంత దారుణంగా విఫలమైనా… ఆలస్యాన్ని భరించి, సహనంతో ఎండలు మండుతున్నా పెద్ద సంఖ్యలో బారులు తీరి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రజలు. అర్ధరాత్రి వరకూ ఓటింగ్ కొనసాగడాన్ని వెల్లువెత్తిన ప్రజా చైతన్యంగా అభివర్ణించడం కంటే, ఎన్నికల నిర్వహణ వైఫల్యంగానే చూడాలి. అందుకే, ఎన్నికలను బేలెట్ విధానంలో నిర్వహించాలని దేశంలోని ప్రధాన పార్టీలన్నీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఆంధ్రాలో అర్ధరాత్రి వరకూ ఓటింగ్ జరిగింది అంటే… అది ముమ్మాటికీ ఈవీఎంల వైఫల్యం, ఏర్పాట్లలో సమన్వయలోపం. దీన్ని ఒక గుణపాఠంగా తీసుకోవాలి.