పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఖర్చు 2015-16 సంవత్సరాన్ని బేస్ గా తీసుకుని లెక్కవేస్తే 36 వేల కోట్లరూపాయలు అవుతుందన్న అంచనాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది. 2013 సంవత్సరం లెక్క ప్రకారం ఇది 16 వేల కోట్లరూపాయలే! ”నిర్మాణం ఖర్చులు పెద్దగా పెరగలేదు. అయితే భూముల విలువ పెరిగిపోవడం, ముంపు నిర్వాసితుల పునరావాసం చాలా ఖరీదైపోవడమే” ఇందుకు కారణమని జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు.ఏమైనా కేవలం 2 ఏళ్ళలో ప్రాజెక్టు అంచనా వ్యయం రెట్టింపుకి పైగా పెరిగిపోవడాన్ని సమర్ధించుకోవడం ఏ ప్రభుత్వానికైనా కొంత కష్టమే! రాజకీయ సమీకరణలనుబట్టే ఇందులో ఇబ్బంది పెరగడమో, పెరగకపోవడమో వుంటుంది.
రాజధానికోసం 33 వేల ఎకరాలను పూలింగ్ ద్వారా సమీకరించి దేశానికే ఆదర్శవంతంగా రాష్ట్రప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కి అదే పద్దతిలో భూమి సమీకరించవచ్చుకదా అని బిజెపి కూడా అనవచ్చు. ఆంధ్రప్రదేశ్ భూముల విలువను ఈ ఉదాహరణతో తెలుగుదేశం ఘనంగా చూపించవచ్చు. ”మీరు పాలనగాక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూన్నందువల్లే ప్రజలు కూడా ధర పెంచేస్తున్నారు” అని తెలగుదేశాన్ని జగన్ దుమ్మెత్తిపోయవచ్చు.
విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టుని కేంద్రప్రభుత్వమే నిర్మించాలి. అప్పటి ఆంచనా ప్రకారం 16 వేల కోట్లరూపాయలకు కేంద్రం వందకోట్లు రూపాయలు మాత్రమే విడుదల చేసింది. ప్రాజెక్టుపై ముందుగా ఖర్చుపెట్టి తరువాత ఆబిల్లుల సొమ్ముని కేంద్ర ఆర్ధిక శాఖనుంచి రాబట్టుకోవచ్చని కేంద్రం తెలియజేసింది. 17 వేలకోట్లరూపాయల నగదులోటుతో వున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందుగా ఎలా డబ్బుఖర్చుపెట్టగలదో మోదీగాని, అరుణ్ జైట్లీగాని, వెంకయ్యనాయుడుగాని, అసలు బిజెపిలో ఏజ్ఞాని అయినాగాని సూచించనేలేదు. పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటికే కేంద్రప్రభుత్వం ఖర్చుపెట్టిన 5 వేలకోట్లరూపాయలూ చెల్లించాలన్న విన్నపానికి కేంద్రం నుంచి ఉలుకూ పలుకూలేదు.
ఈ నేపధ్యంలో నిపుణులు ఇచ్చిన ఖర్చుపెరుగుదల నివేదికను గురువారం నాడు మంత్రివర్గ సమావేశం రికార్డు చేసి ఆమోదించింది. తదుపరి చర్యగా పెరిగిన అంచనా వ్యయాల నివేదికను కేంద్రానికి పంపుతారు. 16 వేలకోట్లరూపాయలకే గతిలేదు 36 వేలకోట్లరూపాయలు వస్తాయా అన్న అనుమానం తెలుగుదేశానికి సరే బిజెపి రాష్ట్రనాయకులకు కూడా తలెత్తక తప్పని వాతావరణం వుంది.
గోదావరి తూర్పు, సెంట్రల్, పశ్చిమ డెల్టాల్లోని 10 లక్షల ఎకరాలల్లో మొదటి పంటకు వరదనుంచి రక్షణకు, రెండోపంటకు నిఖరమైన సాగునీటికీ పోలవరం ప్రాజెక్టు అనివార్యం. ఇందుకు మరో ప్రత్యామ్నాయం కూడాలేదు. ఈనేపధ్యంలో ప్రాజెక్టుపై బిజెపి తెలుగుదేశం పార్టీల మధ్య దాగుడుమూతలు ఉభయగోదావరి జిల్లాల ప్రజానీకానికి అసహనాన్ని రగిలించకముందే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కళ్ళుతెరవాలి. ”ప్రత్యేక హోదా”తోపాటు ”పోలవరం ప్రాజెక్టు” కూడా ప్రజల సెంటిమెంటు గామారకముందే నిర్మాణానికి నిధుల ప్రవాహం మొదలుకావాలి!!