ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ఆర్ధిక సహాయం కింద కేంద్ర ఆర్ధిక మంతత్రిత్వ శాఖ ప్రతిపాదించిన మొత్తంలో ప్రధానమంత్రి కార్యాలయం 1100 కోట్ల రూపాయలు కోత పెట్టింది. అయితే సాధారణ ఆర్ధిక సహాయంగా రాష్ట్రప్రభుత్వం ఊహించని విధంగా 3500 కోట్ల రూపాయల పెద్ద మొత్తాన్నే మంజూరు చేసింది. ఈ ధోరణిని బట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్న ప్రయారిటీలను కేంద్రం గౌరవించదలుచుకోలేదని తాను సూచించిన ప్రాధాన్యతలమేరకే పని చేయవలసి వుంటుందని పరోక్ష వత్తిడి తెస్తున్నారని అర్ధమౌతోంది.
ఈ తరహా నిధుల కేటాయింపులు, మంజూరులు, విడుదలలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ గా తీసుకున్నారు. ఇదే పద్దతి కొనసాగితే ఏపనులూ చేయలేక ప్రజలముందుకి వెళ్ళలేని పరిస్ధితి వస్తుంది. ఇక విన్నపాలు వేడికోళ్ళూ మానేసి చట్టబద్ధంగా ఇవ్వవలసిన నిధుల పై ఆలస్యం తగదని నేరుగా ప్రధానమంత్రికే నిర్మొహమాటంగా లేఖరాయవలసి వుంటుందని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలిసింది. కేంద్రసహాయంలో చిన్నచూపు గురించి కేబినెట్ సమావేశంలో కూడా చర్చించబోతున్నారు.
ఐదురోజుల క్రితం కేంద్ర ఆర్ధిక శాఖ అధికారులు ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ముగిసేలోగా అంటే మార్చి 31 లోగా ప్రత్యేక ఆర్ధిక సహాయం కింద 2000 కోట్ల రూపాయల మొత్తం విడుదల చేస్తున్నామని రాష్ట్ర ఆర్ధిక శాఖ అధికారులకు తెలియజేశారు. అయితే విడుదల అయిన మొత్తం 900 కోట్ల రూపాయలు మాత్రమే! రెండు వేలకోట్ల రూపాయల ప్రతిపాదన ప్రధాని కార్యాలయానికి వెళ్ళగా అక్కడ కోతపడటమే ఈ పరిస్ధితికి కారణమని ఢిల్లీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది.
విడుదలైన 900 కోట్లరూపాయలలో 500 కోట్లు 2014-15 ఆర్ధిక సంవత్సరంలో కేంద్రం బర్తీ చేయవలసి వున్న 14000 కోట్ల రూపాయల ద్రవ్యలోటులో భాగమే!
మిగిలిన 400 కోట్ల రూపాయలలో సగం రాజధాని నిర్మాణానికి, సగం పోలవరం ప్రాజెక్టుకీ ఇచ్చారు.
యుటిలైజేషన్ సర్టిఫికెట్లు లేకపోతే ఏరాష్ట్రానికీ ఆయాపద్దుల కింద నిధులు ఇవ్వకూడదని ప్రధాని కార్యాలయం కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖను ఆదేశించిందని చెబుతున్నారు. అదే నిజమైతే అకౌంటు సరిగా లేవని బిజెపి నాయకులు ఫిర్యాదు చేసిన పోలవరం ప్రాజెక్టుకు, రాజధాని నిర్మాణానికీ అసలు నిధులే రాకూడదు.
రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టూ ప్రాధాన్యత లేని విషయాలని ఎవరూ అనలేరు. వాటిని పక్కనపెట్టేసి కేంద్రం తలపెట్టిన ప్రాజెక్టులైన విశాఖ స్మార్ట్ సిటి కి 200 కోట్లు, కాకినాడ స్మార్ట్ సిటికి 186 కోట్లు, స్వచ్ఛ భారత్ కు 25 కోట్ల రూపాయలు మంజూరు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యతలకు అనుగుణంగా కేంద్ర ఆర్ధిక శాఖ నుంచి ప్రతిపాదనలు వెళ్ళాక స్వయంగా ప్రధాని కార్యాలయమే మార్పులు చేసిందంటే ఎపి మీద నరేంద్రమోదీ వైఖరిని అర్ధం చేసుకోవచ్చు. అయితే, ఒక రాష్ట్రం మీద దేశ ప్రధానే కత్తిగట్టినట్టు వ్యవహరిస్తూండటం బాధాకరం ఆశ్చర్యకరం!!