తెలంగాణ ప్రభుత్వంలో మంత్రులు మాట్లాడినా ఇక అఫీషియల్ కాదు.. కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబులు చెప్పేదే అధికారికం. ఈ విషయాన్ని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర చర్చకు కారణం అవుతోంది. ఇటీవలి కాలంలో సమన్వయం లేక ప్రభుత్వానికి ఎదురవుతున్న ఇబ్బందులు రేవంత్ రెడ్డికి ప్రభుత్వంపై పట్టు లేదని జరుగుతున్న ప్రచారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
కొంత మంది సీనియర్ మంత్రులు ఇష్టం వచ్చినట్లుగా ప్రకటనలు చేస్తున్నారు. ప్రభుత్వ విధానపరమైన అంశాల్లో కనీసం పార్టీలో చర్చ లేకుండా… ప్రభుత్వంలో ప్రతిపాదనలు కూడా లేకుండా ప్రకటనలు చేస్తున్నారు. దీంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ గందరగోళానికి చెక్ పెట్టాలని రేవంత్ రెడ్డి అనుకున్నట్లుగా చెబుతున్నారు. మామూలుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఐ అండ్ పీఆర్ మినిస్టర్. ఆయన చెప్పేదే అధికారికం. ఆయనకు శ్రీధర్ బాబును కూడా తోడుగా ఇవ్వడం … వారు చెప్పేదే అధికారికం అని నొక్కి వక్కాణించడం రేవంత్ లో వచ్చిన మార్పుగా అంచనా వేస్తున్నారు.
రేవంత్ రెడ్డికి ఇప్పుడు పరిపాలనా పరంగా ఎలాంటి ఆటంకాలు లేవు. కోడ్ కూడా లేదు. ఇక పూర్తి స్థాయిలో ఆయన ముద్ర చూపించాల్సి నసమయం వచ్చింది. సీనియర్లు అడ్డం పడ్డారు… చేత కాలేదు అని చెప్పడానికి అవకాశం లేదు. అందుకే మెల్లగా అధికార యంత్రాంగంపై పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు.. అనవసర గందరగోళానికి తెరదింపేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.