గులేటి శ్రీనివాసరెడ్డి జగన్ రెడ్డి జేబులో మనిషి. జగన్ చెబితే రేవంత్ రెడ్డి సర్కార్ ను క్షణాల్లో కూల్చేస్తారని వైసీపీ సోషల్ మీడియా అతి ఫ్యాన్స్ ప్రకటనలు చేస్తూ ఉంటారు. కానీ అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటానని.. స్వయంగా ఆ పార్టీ ఆఫీసుకు వెళ్లి మరీ ధ్యాంక్స్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు అయినా కాస్త నిర్లక్ష్యంగా ఉన్నారేమో కానీ.. టీడీపీ వాళ్లు మాత్రం ఒక్క క్షణం కూడా విశ్రమించకుండా గెలుపు కోసం సహకరించారని.. వారి కృషిని మర్చిపోలేనని ప్రశంసించారు.
ఖమ్మంలో టీడీపీ ఆఫీసుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెళ్లారు. టీడీపీ నేతలకు ఎలాంటి ప్రయోజనం లేకపోయినప్పటికీ.. తెలుగు దేశం పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉందన్న పొంగులేటి.. టీడీపీ కార్యకర్తల ప్రజల అభీష్టం మేరకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడైనా కాంగ్రెస్ నేతలు ఆదమరిచి వ్యవహరించారేమో గానీ.. టీడీపీ కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలిచేంత వరకూ నిద్రపోలేదంటూ.. తెలుగు తమ్ముళ్లపై పొంగులేటి ప్రశంసలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ ఆఫీసుకు వెళ్లగానే ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన మంత్రి.. టీడీపీ, కాంగ్రెస్ వేర్వేరు కాదని.. భవిష్యత్తులోనే కలిసే ఉందామని ఖమ్మం టీడీపీ నేతలకు భరోసా ఇచ్చారు.
పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఏపీ సీఎం జగన్ కుటుంబానికి సన్నిహితుడు. ఏపీలో బోలెడన్ని కాంట్రాక్టులు కూడా ఆయన కంపెనీకి ఇవచ్చాయి. వైఎస్సార్సీపీ ద్వారానే పొంగులేటి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఖమ్మం నుంచి పోటీ చేసిన పొంగులేటి.. టీడీపీ నుంచి పోటీ చేసిన నామా నాగేశ్వరరావుపై గెలుపొందారు. తెలంగాణ వైఎస్సార్సీపీ బాధ్యతలను జగన్ పొంగులేటికి అప్పగించారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆయన కేసీఆర్ పార్టీలో చేరారు. అయినా సరే జగన్ కుటుంబంతో అనుబంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.
కానీ ఇప్పుడు జగన్ రెడ్డి ముద్ర ఉంటే తనకు నష్టం అనుకుంటున్నారేమో కానీ.. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి.. టీడీపీ సానుభూతి పరుల మద్దతు కోసం ఆయన గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఏపీలో ప్రభుత్వం మారిన తనకు ఢోకా లేకుండా చూసుకునే ప్లాన్ కూడా ఉందన్న అభిప్రాయం ఉంది.