ఒకప్పుడు రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమైక్యాంధ్ర స్టాండ్ తీసుకోవడంతో కొండా సురేఖ వంటి బలమయిన, విశ్వసనీయమయిన నేతలు ఆ పార్టీకి దూరం అయ్యేరు. మళ్ళీ ఇప్పుడు తెలంగాణా ప్రాజెక్టులని వ్యతిరేకిస్తూ కర్నూలులో మూడు రోజులు నిరాహార దీక్ష చేయాలని జగన్ సిద్దం అవడంతో తెలంగాణా వైకాపా అధ్యక్షుడు పొంగులేటి సుద్ధాకర్ రెడ్డి, పార్టీలో మిగిలిన ఏకైక ఎమ్మెల్యే వెంకటేశ్వరులు వైకాపాకి గుడ్ బై చెప్పేసి తెరాసలో చేరిపోతున్నట్లు ప్రకటించారు. ఆంధ్రాలో వైకాపా ఎమ్మెల్యేలని తరలించుకొనిపోతున్న తెదేపాని అడ్డుకొనే ప్రయత్నంలోనే జగన్మోహన్ రెడ్డి ఈ దీక్షకు కూర్చోబోతుంటే, ఆ దెబ్బకు తెలంగాణాలో తన స్వంతపార్టీ మూసుకొని పోవడం విచిత్రం. అయినా తెలంగాణాలో పేరుకే తప్ప ఎక్కడా దాని ఉనికే లేదు కనుక అది మూసుకుపోయినా జగన్ అందుకు బాధపడకపోవచ్చు.
పొంగులేటి సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ “తెలంగాణాలో వైకాపాని కాపాడుకొనేందుకు నేను చాలా ప్రయత్నించాను కానీ దానినిప్పుడు ప్రజలు ఆదరించడం లేదు. అతి కష్టం మీద ఖమ్మం జిల్లాలో మాత్రం పార్టీని నిలబెట్టగలిగాను కానీ జగన్మోహన్ రెడ్డి తెలంగాణా వ్యతిరేక వైఖరి కారణంగా ప్రజలు ఇంకా దూరం అవుతున్నారు. పాలమూరు ప్రాజెక్టుకి వ్యతిరేకిస్తూ ఆయన దీక్ష చేపట్టడంతో మేము ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి కల్పించారు. వైకాపా ఆంధ్రా పార్టీ అనే ప్రజలలో ఉన్న భావనని ఆయన మరింత బలపరిచినట్లయింది. తెలంగాణాలో వైకాపా మనుగడ ఇంక కష్టమే. అందుకే తెరాసలో చేరాలని నిశ్చయించుకొన్నాము,” అని చెప్పారు.
పొంగులేటి వైకాపాని వీడేందుకు చాలా రోజుల క్రిందటే సిద్దమయ్యారు. అందుకు జగన్ చాలా బలమయిన కారణం అందించడంతో ఆయన దానిని చక్కగా వినియోగించుకొని పార్టీ నుంచి బయటపడ్డారని చెప్పవచ్చు. తెలంగాణాలో వైకాపా నేతలకు ఏదో ఒకరోజు ఇటువంటి పరిస్థితే ఎదురవుతుందని ఇదివరకే తెలుగు360 ఊహించింది. అదే జరుగుతోందిప్పుడు.
తెదేపా నేతలు కూడా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం మేలు లేకుంటే వారికి కూడా మున్ముందు ఇదే పరిస్థితి ఎదురవవచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి ఆటుపోటులను ఎదుర్కొని నిలవగల సత్తా ఉంది కానీ అందుకు అది చాలా గట్టిగా కృషి చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం భాజపా కేంద్రంలో అధికారంలో ఉంది కనుక తెరాస దాని జోలికి రావడం లేదు లేకుంటే దానిని కూడా ఎప్పుడో తుడిచిపెట్టేసేవారు. కనుక భవిష్యత్ లో దాని పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండవచ్చు.