సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికార పార్టీ తెరాసకు దూరమౌతారా..? ప్రస్తుతం ఆయనకి పార్టీలో గుర్తింపు లభించడం లేదా..? సొంత జిల్లాలో ఆయనకి రాజకీయ భవిష్యత్తు కనిపించడం లేదా..? ఇలాంటి కొన్ని ప్రశ్నలకు ఇప్పుడు అవుననే సమాధానమే వస్తోంది! తెరాసలో తనకు గుర్తింపు లభించడం లేదన్న అసంతృప్తి ఆయనలో మొదలైందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దానికి కారణం.. సొంత జిల్లాలో కుల సమీకరణాలు మారిపోవడం, ఇతర నాయకులకు తెరాసలో ప్రాధాన్యత పెరిగిపోవడమే అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
తెరాస తరఫున ఖమ్మం లోక్ సభ సీటు ఆశించారు పొంగులేటి. కానీ, ఆయనకి దక్కలేదు. సరే, ఆ తరువాతైనా ప్రత్యేక ప్రాధాన్యత లభించిందా అంటే అదీ లేదు. ఎన్నికల ముందు పార్టీలో చేరిన నామా నాగేశ్వరరావుకి టిక్కెట్ దక్కింది. ఆయన ఎంపీ అయిపోయారు. దాంతో జిల్లా రాజకీయాల్లో ఆయన పట్టు సాధించుకున్నారు. మరో నేత తుమ్మల నాగేశ్వరరావు కూడా జిల్లాలో పట్టు సాధించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఆయనకీ త్వరలోనే సీఎం కేసీఆర్ సముచిత స్థానం కల్పిస్తారని ప్రచారం జోరుగానే జరుగుతోంది. దీంతో జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న పొంగులేటి సైలెంట్ అయిపోవాల్సిన పరిస్థితి వచ్చిందనీ, ఆయనకి పార్టీ నుంచి ఏదో ఒక పదవో, గుర్తంపులో ఉంటుందనే సంకేతాలూ లేవని ఆయన సన్నిహితులు అంటున్నారు. కుల సమీకరణాలు చూసుకుంటే… ఖమ్మం జిల్లాలో కమ్మ సామాజిక వర్గం ఇప్పుడు తెరాసలో కీలకంగా మారినట్టు కనిపిస్తోంది!
ఏరకంగా చూసుకున్నా పొంగులేటికి తెరాసలో అనూహ్యమైన గుర్తింపు లభిస్తుందనే వాతావరణం లేదనీ, అందుకే ఇప్పుడాయన ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారని వినిపిస్తోంది. ఆ ప్రత్యామ్నాయం ఏంటంటే… కరెక్టే, భారతీయ జనతా పార్టీ!! ఇప్పటికే ఓసారి ఢిల్లీ వెళ్లి, భాజపా పెద్దలతో పొంగులేటి భేటీ అయి వచ్చారట! ఒక బలమైన సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి, భాజపాకి కూడా తెలంగాణలో ఇలాంటి నేతలు అవసరం ఉంది. పొంగులేటి అంశం ఇంకా సీఎం కేసీఆర్ వరకూ వెళ్లలేదని, వెళ్తే ఆయన్ని బుజ్జగించి ఆపే ప్రయత్నాలు ఉండొచ్చనీ తెరాస వర్గాలు అంటున్నాయి.