ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివసారెడ్డి… తమ పార్టీలోకి వస్తారని బహిరంగంగా ప్రకటించుకున్న షర్మిలకు … షాక్ తగిలింది. తాను జాతీయ పార్టీలోకే వెళ్తానని ప్రకటించేశారు. ఏ పార్టీ అనేది నెలాఖరులోగానే వెల్లడిస్తానని ప్రకటించారు. ఆయనతో బీజేపీ నేతలు టచ్ లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఖమ్మం మొత్తం తన పట్టు ఉండేలా ఆయన బెట్టు చేస్తున్నారు. ఇప్పటికే తన పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసి… వారితో ప్రచారాన్ని కూడా ప్రారంభింపచేశారు.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా గెలిచారు. ఆయన వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడు. ఎంత అంటే… జగన్ బినామీ కంపెనీగా పేరు పడిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ తో పాటుగా పొంగులేటికి చెందిన కంపెనీలకు ఏపీలో కాంట్రాక్టులు దక్కుతున్నాయి. తెలంగాణలో వైసీపీ ఉండకూడదని డిసైడైన తర్వాత జగన్ అనుమతితోనే ఆయన బీఆర్ఎస్ చేరారు. కానీ గత ఎన్నికల్లో ఆయనకు పోటీ చేయడానికి టిక్కెట్ లభించలేదు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనకు టిక్కెట్ లబించే అవకాశాలు లేవని భావించడంతో ఇటీవల ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు.
ఏ పార్టీలో చేరాలన్న దానిపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆయన బీజేపీ పెద్దలతో సమావేశం అయ్యారని గతంలో ప్రచారం జరగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆయనకు ఆహ్వానం పంపారని చెబుతున్నారు. అయితే పొంగులేటి మాత్రం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలతో పాటు .. వైఎస్ విజయలక్ష్మితోనూ రెండు సార్లు సమావేశం అయ్యారు. ఈ విషయాన్ని ఆయన ధృవీకరించారు. కానీ చేరడం లేదని స్పష్టమయింది.