గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు పెళ్లి అలా చేశాడట. ఇలా చేశాడట… అని చెప్పుకున్నారు. ఇప్పుడు మరో తెలంగాణ నేత ఇంట్లో జరగబోయే పెళ్లి గురించి కూడా అలా చెప్పుకుంటున్నారు. ఆయనే టీఆర్ఎస్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. బడా కాంట్రాక్టర్ అయిన ఆయన కుమార్తె పెళ్లి జరుగుతోంది. అలా ఇలా కాదు. రాజకీయ కుటుంబానికే కుమార్తెను పంపుతున్న ఆయన.. డెస్టినేషన్ వెడ్డింగ్ చేయిస్తున్నారు. కనీసం పది ప్రత్యేక విమానాల్లో ఇండోనేషియాలోని బాలికి వెళ్తున్నారు. అదిరిపోయే లగ్జరీ ఏర్పాట్లు ఉండనున్నాయి.
అక్కడ్నుంచి వచ్చాక ఖమ్మంలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్ కోసం చేస్తున్న ఖర్చు అంతా ఇంతా కాదు. ఓ పెద్ద రాజకీయ పార్టీ వంద ఎకరాల్లో సభ పెట్టడానికి టెన్షన్ పడుతుంది. కానీ పొంగులేటి మాత్రం వంద ఎకరాల్లో రిసెప్షన్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఏర్పాట్ల దగ్గరకు వచ్చిపోయే దారి చిన్నగా ఉందని.. రూ. కోటి పెట్టి వంతెన నిర్మించేశారు కూడా. దారికే అంత ఖర్చు పెడుతున్నారంటే.. ఇక ఏర్పాట్ల గురించి చెప్పాల్సిన పని లేదు.
నెల రోజులుగా ఆహ్వానాలు, పెళ్లి గిప్ట్‌ల పేరుతో వాచీల పంపిణీ పూర్తి చేశారు. కనీసం లక్ష మందికి ఇలా ఆహ్వానాలు పంపిణీ చేసినట్లుగా తెలుస్తోంది. 17న ఖమ్మంలో రిసెప్షన్ జరగనుంది. ఇందులో 30 ఎకరాల్లో రిసెప్షన్ వేదికతో పాటు పార్కింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు, వివాహ రిసెప్షన్ వేదికలు బాహుబలి లాంటి సెట్టింగ్‌లతో నిర్మిస్తున్నారు. 3 లక్షల మందికి భోజనం చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌లోనూ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. కట్నాలు కానుక సంగతి పక్కన పెడితే.. కేవలం..పెళ్లి.. రిసెప్షన్ ఖర్చులే వంద కోట్లకుపైగా ఖర్చు పెడుతున్నారని ఖమ్మం మొత్తం గుసగుసలాడుకుంటున్నారు.