తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పటికీ కూడా.. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆ రాష్ట్రంలో నానా కష్టాలు పడుతున్నది. రోజురోజుకూ తగ్గిపోతున్న బలంతో.. అసలు తమ పార్టీ బతికి ఉంటుందో లేదో, లేదా, ఏపీలోలాగా నామమాత్రంగా మారిపోతుందోనని గత్యంతరం లేని నేతలు ఆందోళన చెందే స్థాయికి ఎందుకు చేరుకుంటున్నది అంటే.. అచ్చంగా.. ఆ పార్టీలో ఉన్న లుకలుకలే, నాయకుల మధ్య స్పర్ధలే కారణం అని ఇట్టే చెప్పేయవచ్చు. ఆపార్టీకి తెలంగాణలో భవిష్యత్తు అంటూ ఉన్నదని చెప్పగల స్థితిలో ఎవ్వరూ లేరు గానీ.. ఉంటే ఇంకా నాయకుల మధ్య కీచులాటలు ఏ రేంజిలో ఉంటాయోనని అంతా విస్తుపోయేలా వారు తగాదాలు పడుతున్నారు.
గురువారం నాడు టీకాంగ్రెస్ సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఎమ్మెల్యేలు క్యూకట్టి గులాబీ తీర్థం పుచ్చుకుంటూ ఉన్న నేపథ్యంలో.. ఇంకా వెళ్లదలచుకుంటున్న వారికి అడ్డుకట్ట వేయడానికి ఏం చేయాలో చర్చించడం అనేది ఈ సమావేశం ఎజెండా. అయితే ఈ సమావేశానికి ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి కూడా హాజరయ్యారు. ఆయన రాగానే.. సమావేశాన్ని కేవలం ఎమ్మెల్యేలకు మాత్రమే ఏర్పాటుచేశాం అని.. మిగిలిన వారికి ఎంట్రీ లేదని టీపీసీసీ చీఫ్ ఉత్తం కుమార్ రెడ్డి ప్రకటించడం, దాని మీద పొంగులేటి సుధాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసి, తనను ఆహ్వానించినందునే సమావేశానికి వచ్చానని, తీరా ఇక్కడకు వచ్చిన తర్వాత.. అవమానించారని కోపంగా బయటకు వెళ్లిపోవడం లాంటి పరిణామాలన్నీ వరుస క్రమంలో జరిగిపోయాయి. అసలు నాయకుల వలసలను నియంత్రించడం ఇలా నాలుగ్గోడల మధ్య కూర్చుని చర్చిస్తే ఏం సాధ్యం అవుతుందంటూ.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సమావేశం నుంచి వెళ్లిపోయారు.
నిజానికి.. పార్టీని కాపాడుకోవడానికి పెట్టిన సమావేశం ఇది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం గురించి రహస్య సమావేశం కాదు. అలాంటి సమావేశంలో నాయకులు ఎవరు వచ్చినా సరే వారి సలహాలు తీసుకోవడం ఉపయోగపడుతుందే తప్ప నష్టం ఉండదు. కానీ.. టీపీసీసీ చీఫ్ పొంగులేటిని ఎందుకు అనుమతించలేదో తెలియదు. దానికి తగినట్లు ఆయన కూడా అందరి మీద ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ వెళ్లిపోవడం.. పార్టీలో లుకలుకలకు నిదర్శనమే. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా క్రమంగా పతనం అయిపోతూ ఉండడానికి ఇలా నాయకుల మధ్య ఉన్న విభేదాలే కారణం అని అందరూ వ్యాఖ్యానిస్తున్నారు.