బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను సస్పెండ్ చేశారు. ఇరువురు నేతలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో కేసీఆర్ ఆదేశాలతో సస్పెండ్ చేసినట్లుగా బీఆర్ఎస్ ప్రకటించింది. ఆదివారం కొత్తగూడెంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి జూపల్లి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు కేసీఆర్ ను టార్గెట్ చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు.
వీరిద్దరూ బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు. సమయం, సందర్భం దొరికినప్పుడల్లా కేసీఆర్ ప్రభుత్వ పరిపాలనపై పొంగులేటి విమర్శలు చేస్తున్నారు. జూపల్లి నేరుగా విమర్శలు చేయలేదు కానీ సొంత రాజకీయం చేసుకుంటున్నారు. కొల్లాపూర్లో తాను ఓడిపోతే.. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను బీఆర్ఎస్లో చేర్చుకుని ఆయనకే టిక్కెట్ ఖరారు చేశారు. దీంతో జూపల్లి దూరమయ్యారు. ఆయన ఇప్పుడు కేసీఆర్ పై నేరుగా విమర్శలు చేస్తున్నారు.
ఈ ఇద్దరు నాయకులు ఇప్పటి వరకూ బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదు. కానీ, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తరచూ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. గత మూడేళ్లుగా తనకు సభ్యత్వం కూడా ఇవ్వలేదని, అధిష్టానాన్ని కలిసే ప్రయత్నం చేసినా అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. వారంతటకు వారు వెళ్లిపోతారేమో అని బీఆర్ఎస్ అనుకుంది కానీ అదే పనిగా విమర్శలు చేస్తూండటంతో సస్పెండ్ చేయక తప్పలేదు. ఏదో ఓ జాతీయ పార్టీలో చేరుతానని ఇప్పటికే పొంగులేటి ప్రకటించారు. ఇద్దరు కలిసి బీజేపీలో చేరవచ్చని భావిస్తున్నారు.