జగన్ బినామీ వ్యాపార భాగస్వామిగా పేరున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసందర్భంగా అమరావతిపై నోరు పారేసుకుంటున్నారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి రియల్టర్లు భయపడుతున్నారని చెప్పుకొస్తున్నారు. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్ చిట్ అని చెప్పి సాక్షి మీడియాకు.. బీఆర్ఎస్ సన్నిహిత మీడియాతోనే మాట్లాడేరేమో కానీ.. వారు మాత్రమే ఆయన అమరావతిపై చేసిన కామెంట్లు ప్రచారం చేశారు. ఓ పొరుగు రాష్ట్ర రాజధాని , ప్రాజెక్టులపై మరో రాష్ట్ర మంత్రి అలాంటి వ్యాఖ్యలు చేయడం ఖచ్చితంగా దురుద్దేశపూరితమే అనుకోవచ్చు.
ఏపీ పాలకులు ఎప్పుడూ హైదరాబాద్ గురించి కానీ తెలంగాణ గురించి కానీ నెగెటివ్ కామెంట్స్ చేయలేదు. అక్కడి పెట్టుబడులు ఇక్కడికి వస్తాయని చెప్పలేదు. చంద్రబాబు సందర్భం వచ్చినప్పుడల్లా హైదరాబాద్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోందని చెబుతున్నారు. అలాంటిది పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇప్పుడు పొరుగు రాష్ట్ర రాజధాని అమరావతిపై విషం చిమ్మాల్సిన అవసరం ఏమిటి ?. జగన్ తో కలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మళ్లీ అమరావతిపై కుట్రలు ప్రారంభిస్తున్నారని ఎవరైనా అనుకుంటే అందులో తప్పేమీ ఉండదు.
తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న వారు ఇలా ఏపీ గురించి.. ఏపీ రాజధాని గురించి వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభిస్తే ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడటానికి కూటమి కార్యకర్తలు కూడా రెడీగా ఉంటారు. పెట్టుబడులు ఎక్కడికి వస్తున్నాయో.. ఎవరి పని తనం ఏమిటో ఏ రాష్ట్రంలో ప్రజలు ఆ రాష్ట్రంలో నిర్ణయించుకున్నారు. పొంగులేటి ప్రత్యేకమైన ఎజెండాలతో వ్యాఖ్యలు చేస్తే.. మొదటికే మోసం వస్తుందని టీడీపీ క్యాడర్ హెచ్చరికలు జారీ చేస్తోంది.