ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో రూ. 50 కోట్ల గోల్ మాల్ వ్యవహారంలో కేటీఆర్ ను అరెస్టు చేయాలా లేదా అన్నది చట్టం చూసుకుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఎప్పట్లాగే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. కేబినెట్ సమావేశం తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్ రేస్ విషయంలో కేబినెట్ లో చర్చ జరిగిందని.. గవర్నర్ ఇచ్చిన అనుమతిని ఏసీబీకి పంపాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఎస్‌కు ఆదేశాలు ఇచ్చారు.
ఈ రాత్రికే ఏసీబీకి సీఎస్ గవర్నర్ ఇచ్చిన అనుమతిని పంపుతారు. అదే సమయంలో ఈ డబ్బులను స్వయంగా బదిలీ చేసిన ఐఏఎస్ అర్వింద్ కుమార్ పై ఏసీబీ విచారణకు ఆదేశాలు ఇచ్చారు. కేటీఆర్ నోటి మాటగా ఆదేశిస్తే.. హెచ్ఎండీఏ ఉన్నతాధికారిగా అర్వింద్ కుమార్ డబ్బులు బదిలీ చేశారు. ఆ తర్వాత అయినా చట్ట పరంగా చేయాల్సిన ప్రక్రియ పూర్తి చేయలేదు. దాంతో అక్రమంగా నగదు తరలించేసినట్లు అయింది.
అధికారంలోకి వచ్చినప్పుడే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అప్పట్లోనే నివేదికలు తెప్పించుకున్నారు. అయితే ఇంత కాలం ఆగారు. అక్టోబర్ లోనే గవర్నర్ పర్మిషన్ అడిగారు. న్యాయ సలహా తర్వాత ఇప్పుడు పర్మిషన్ రావడంతో ఏసీబీ కేసు నమోదు చేయనుంది. అరెస్టు విషయంలో ఎలాంటి వ్యూహాన్ని రేవంత్ రెడ్డి పాటిస్తారన్నది కీలకం.