ఆంధ్ర ప్రదేశ్‌లో తెలుగుదేశం తమ పార్టీవారిని చేర్చుకున్నందుకు వైసీపీ అధినేత జగన్ ఆగ్రహౌదగ్రమవుతున్నారు. అయితే తెలంగాణలో ఇప్పటికే తమ ఎంఎల్ఎలను చేర్చుకున్న టిఆర్ఎస్కు మాత్రం ఎన్నికల్లో ఓటు చేశారు. ఇదో రాజకీయ ఫజిల్. ఆ సంగతి అలా వుంచితే తెలంగాణలో వైసీపీకి ఏకైక దిక్కుగా వున్న ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా త్వరలో టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవచ్చని ఆ పార్టీకి దగ్గరగా వున్నవారే చెబుతున్నారు. ఇప్పటికే ఆయనకు కెసిఆర్‌తో కావలసినంత సాన్నిహిత్యం వుంది. అయినా మరో పార్టీలో వుంటూ పనులు చేయించుకోవడం సమస్యగానే వుంటుంది. కనుక ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు కాగానే పొంగులేటి గులాబీ కండువా కప్పుకోవచ్చని భావిస్తున్నారు.
ఇదే సమయంలో ఎపిలో తాజా పరిణామాల తర్వాత దర్శకుడు దాసరి నారాయణరావు గురించి వైసీపీ పునరాలోచనలో పడినట్టు సమాచారం. గతంలో జగన్ ఆయనను కలుసుకున్న తర్వాత వైసీపీలో చేరేందుకు సుముఖత ప్రకటించారు. మేలో అందుకు ఆయన జన్మదినం ముహూర్తంగా నిర్ణయమైంది. అయితే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు పెద్దఎత్తున టిడిపిలో చేరిపోతుంటే తాను అందులో చేరేందుకు దాసరి సిద్ధం అవుతారా? అయితే ఏ ప్రయోజనం కలుగుతుంది? రాజ్యసభకు పంపిస్తారా?ఇప్పటికే ఆ ఆవకాశం లేదని తేలిపోయిన మైసూరా రెడ్డి వంటివారికి బదులు విజయసాయి రెడ్డి పేరు వినిపిస్తున్నది గనక దాసరికి రిక్తహస్తమేనా? అలా అయితే కోరి కోరి ఈ ప్రతిపక్ష పార్టీలో ఆయన ఎందుకు చేరతారు? ఇవన్నీ ప్రశ్నలుగా మిగిలివున్నాయి.