బీఆర్ఎస్ పార్టీతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారు. బాంబులు ఖాయమంటూ ఆయన చేస్తున్న ప్రకటనలు బీఆర్ఎస్ నేతల్ని ఇరిటేషన్‌కు గురి చేస్తున్నాయి. అందుకే ఆయనకు బాంబుల శాఖకు మంత్రిని చేయాలని కేటీఆర్ లాంటి నేతలు మండి పడుతున్నారు. ఇదిగో అరెస్టు.. అదిగో అరెస్టు అని పొంగులేటి చేస్తున్న ప్రకటనలతో కేటీఆర్ టెన్షన్ కు గురవుతున్నారు. ఆయన రోజూ అరెస్టుల గురించి మాట్లాడుతూండటమే దీనికి సంకేతం.
ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించి ఇప్పటికే కొన్ని అరెస్టుల కోసం గవర్నర్ అనుమతిని ఏసీబీ కోరిందని చెబుతున్నారు. ఆయన అనుమతి ఇచ్చారా లేదా అన్నది స్పష్టత లేదు. అనుమతి వచ్చి ఉంటే.. తమ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లే అవకాశం ఉంది. అయితే రాజకీయంగా మైనస్ అవుతుందని అనుకుంటే మాత్రం ఏసీబీకి ప్రభుత్వం పెద్దగా పని పెట్టే అవకాశం ఉండదు. కానీ పొంగులేటి మాత్రం.. మైండ్ గేమ్ ఆడటం వల్ల ఎలాంటి రాజకీయ నష్టం ఉండదని అనుకుంటున్నారు.
పొంగులేటిపై ఎదురుదాడికి బీఆర్ఎస్ కూడా రెడీ అయింది. ఆయన మంత్రిగా ఉంటూ కాంట్రాక్టులు పొందుతున్నారని ఆరోపిస్తున్నారు. కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టును మేఘాతో కలిసి రాఘవ కంపెనీ చేజిక్కించుకుంది. అది పొంగులేటిది . అలా చేయడం క్విడ్ ప్రో కోనేనని ఆయన రాజీనామా చేయాలని అంటోంది. ఆయన కూడా జైలుకెళ్తారని అంటోంది. తమను జైలుకు పంపే కంటే ముందే ఆయన జైలుకెళ్లకుండా చూసుకోవాలని కేటీఆర్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొత్తంగా బీఆర్ఎస్ , పొంగులేటి మధ్య మైండ్ గేమ్ నడుస్తోంది.