మెల్లిగా కాంగ్రెస్ నేతల స్వరం మారింది. మొన్నటిదాకా చంద్రబాబు ని ఆకాశానికి ఎత్తుతూ మాట్లాడిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు పరాజయానికి కారణాలను విశ్లేషించి పనిలో పడ్డారు. త్వరలోనే పంచాయతీ మరియు స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండడంతో కనీసం ఇప్పటికైనా మేలుకోకపోతే మళ్లీ అపజయాన్ని మూటగట్టుకోవలసి వస్తుందని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు స్వరం మార్చారు.
కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం ఎటువంటి వ్యూహాలను అమలు చేయాలన్న దానిపై కాంగ్రెస్ హైకమాండ్ తో ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్ర నాయకత్వాన్ని మారిస్తే బాగుంటుంది అని ఆయన సోనియాగాంధీకి వివరించినట్లు సమాచారం. పొంగులేటి సూచనలను సోనియా గాంధీ కూడా సావధానంగా విన్నట్టు సమాచారం. తెలంగాణ సెంటిమెంట్ అనే బేస్ మీద ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో పరిస్థితిని సరిగ్గా అంచనా వేయకుండా చంద్రబాబు తో పొత్తు పెట్టుకుని 2018 ఎన్నికలలో నష్టపోయామని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. 2014లో కూడా చేసిన మేలుని సరిగ్గా చెప్పుకోలేక, తెలంగాణ ఇచ్చి కూడా ఓడిపోవాల్సి వచ్చింది అని ఆయన సోనియా గాంధీతో వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.
ఏది ఏమైనా తెలంగాణ కాంగ్రెస్ నేతలు, చంద్రబాబు తో పొత్తు కారణంగా నష్టపోయామని బహిరంగంగా అంగీకరించే పరిస్థితి కి వచ్చినట్టు అర్థమవుతోంది.