పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డికి ఖరీదైన వాచ్‌లను అక్రమంగా దిగుమతి చేసుకుంటున్నారన్న ఆరోపణలతో చెన్నై కస్టమ్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరయ్యేందుకు ఆయన ఇష్టపడటం లేదు. రకరకాల కారణాలు చెప్పి వెనుకడుగు వేస్తున్నారు. తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని అంటున్నారు కానీ వాస్తవమేంటో చెప్పడం లేదు.
చెన్నై కస్టమ్స్ అధికారులు ఇటీవల ఓ వ్యక్తిని ఎయిర్ పోర్టులో పట్టుకున్నారు. ఆ వ్యక్తి వద్ద రెండు ఖరీదైన వాచ్లుఉన్నాయి. పటెక్ ఫిలిప్, బ్రిగెట్ బ్రాండ్ లకు చెందిన వాచ్‌లు అవి. అత్యంత ఖరీదైన ఆ బ్రాండ్ వాచ్‌లు ఇండియాలో దొరకవు. పట్టుబడిన వారి వద్ద నుంచి వివరాలు సేకరిస్తే.. అవి పొంగులేటి కుమారుడు హర్షారెడ్డికి చెందినవిగా గుర్తించారు. రెండు వాచ్‌ల ఖరీదు రూ. కోటి 75 లక్షల వరకు ఉంటుందని అంచనా.
ఈ వాచ్‌ల కోసం బిట్ కాయిన్ల రూపంలో హర్షా రెడ్డి డబ్బు చెల్లించినట్లు సమాచారం. దీనిపై కేసు నమోదు చేసుకున్న చెన్నై కస్టమ్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఇప్పటికే నవీన్‌కుమార్‌ను విచారించిన చెన్నై కస్టమ్స్ అధికారులు.. హర్షకు కూడా నోటీసులు ఇచ్చారు. ఏప్రిల్ 4వ తేదీన విచారణకు రావాలని ఆదేశించారు. అయితే తనకు ఒంట్లో బాగోలేదని.. ఏప్రిల్ 27 తర్వాతే విచారణకు హాజరవుతానని పొంగులేటి హర్ష రిప్లై ఇచ్చారు.
ఖరీదైన వాచ్‌లను పన్నులు కట్టకుండా… తీసుకు వచ్చే బిజినెస్ వ్యవస్థీకృతంగా నడుస్తూ ఉంటుందని చాలా కాలంగా ప్రచారం ఉంది. ఈ కేసు కొత్త మలుపులు తిరిగే అవకాశం ఉంది.