కాంగ్రెస్, టీడీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాల కేసులపై సీఎం కేసీఆర్ చేసిన సమీక్షపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. ఉత్తమ్, పొన్నాల హయాంలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపిస్తుందని వస్తున్న కథనాలపై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. భూముల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలు జరిగాయంటూ, బాధ్యులపై చర్యలు తప్పవని కేసీఆర్ ఇస్తున్న లీకులకు భయపడేది లేదని ఆయన అన్నారు. మూడేళ్ల తరువాత కేసీఆర్ నోట పొన్నాల మాట ఎందుకొస్తోందన్నారు. ప్రభుత్వం అలాట్ చేసిన భూమిని తాము కొన్నామనీ, దాన్లో ఎలాంటి పొరపాటూ అవినీతి జరగలేదన్నారు.
ఒకవేళ ఈ వ్యవహారంలో తప్పు జరిగినట్టు నిరూపిస్తే… అసెంబ్లీ ముందు తాను ఉరివేసుకుంటానని గతంలో స్వయంగా చెప్పానన్నారు. అలాంటప్పుడు, చర్యలుంటాయనీ, ఇప్పుడేదో జరిగిపోతోందని లీకులు ఇవ్వాల్సిన అవసరం ఏముందన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆస్తులు సంపాదించారనీ, ముఖ్యమంత్రి అయిన తరువాత ఏమేం చేశారో ప్రజలకు తెలుసు అన్నారు. అయినా, ఇప్పుడీ అంశం ఎందుకు తెరమీదికి తెస్తున్నారని మండిపడ్డారు. ‘గ్యాంగ్ స్టర్ నయ్యూం కేసు ఏమైంది..? మియాపూర్ భూముల కేసులు ఏమయ్యాయి..? ఇబ్రహీంపట్నం భూ వ్యవహారం ఎక్కడుంది..? కేసీఆర్ అనుయాయులు ఆక్రమించుకున్న భూముల పరిస్థితేంటీ..? తమపై ఏదో ఉందీ ఉందీ అని చెప్పేబదులు, చర్యలకు ఆదేశిస్తే సరిపోయేది కదా’ అంటూ పొన్నాల ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసుల సమీక్ష అంటూ కొత్త చర్చ తీసుకొచ్చిపెట్టారు. అయితే, ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ రాజకీయంగా ధీటుగా అదే కేసులతో ఎదుర్కోవడానికి సిద్ధమౌతున్నట్టుగా ఉంది. సంచలనం రేపిన నయ్యూం కేసు, మియాపూర్, ఇబ్రహీంపట్నం భూముల కేసు… ఇవన్నీ తెరమరుగైపోయిన మాట వాస్తవమే. ఈ సందర్భంలో వాటి సంగతేంటీ..? ఎందుకు నీరుగార్చారు అనే చర్చ కూడా మొదలౌతోంది. అంటే, కేవలం రాజకీయ ప్రయోజనాలకు ఆస్కామున్న కేసుల్ని మాత్రమే ప్రస్థావిస్తారా..? మిగతావాటికి ప్రాధన్యత ఉండదా.? మూడేళ్లపాటు మౌనంగా ఉండి, ఎన్నికలకు ఏడాది ముందే కేసుల పేరుతో హడావుడి సృష్టించడం ద్వారా ఇస్తున్న సందేశమేంటనే చర్చ ప్రజల్లో కూడా జరుగుతుంది కదా.